Aanie: ఒకప్పుడు నిమ్మకాయ సోడాలు అమ్మిన ఊళ్లోనే ఎస్సైగా వచ్చిన కేరళ యువతి
- కేరళలోని వర్కాల ఎస్సైగా ఆనీ
- పెళ్లి విచ్ఛిన్నం కావడంతో అనేక ఉద్యోగాలు
- సోడాలు, ఐస్ క్రీములు కూడా అమ్మిన ఆనీ
- కష్టపడి ఎస్సై ఉద్యోగం సాధించిన వైనం
"కృషి ఉంటే మనుషులు రుషులవుతారు" అంటూ ఓ తెలుగు సినీ కవి పేర్కొన్నది అక్షర సత్యం. అందుకు నిదర్శనంగా కేరళకు చెందిన ఆనీ (31) గురించి చెప్పుకోవచ్చు. ఒకప్పుడు నిమ్మకాయ సోడాలు అమ్మిన ఆనీ ఇప్పుడు రాష్ట్ర పోలీసు విభాగంలో సబ్ ఇన్ స్పెక్టర్. అది కూడా వైవాహిక జీవితం విచ్ఛిన్నం కాగా, ఓ శిశువుకు జన్మనిచ్చి సమాజంలో ఎంతో వ్యతిరేకతను ఎదుర్కొంటూనే తాను అనుకున్నది సాధించిన ఆనీ... ఇప్పుడు తనలాంటి మరెందరికో ఆదర్శంగా నిలుస్తోంది.
ఆనీ... చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని, ఆ గృహ హింసను భరించలేక భర్త నుంచి విడిపోయి వచ్చేసింది. అప్పటికి తన వయసు 19 ఏళ్లు. 9 నెలల పసికందుతో కాపురం వదిలేసుకుని వచ్చి ఈ లోకాన్ని ఎదిరించి నిలిచిన ఆనీ... పొట్టకూటి కోసం నిమ్మకాయ సోడాలు, ఐస్ క్రీమ్ విక్రయించడమే కాకుండా, బీమా ఏజెంటుగానూ పనిచేసింది. నెలకు రూ.3,500 సంపాదిస్తే రూ.3 వేలు ఇంటి అద్దెకే పోయేవని, తన బాబు కోసం రూ.400 దాచిపెట్టగా, తన వద్ద రూ.100 మిగిలేవని ఆనీ మీడియాకు తెలిపింది.
ప్రస్తుతం ఆనీ కేరళ రాజధాని తిరువనంతపురంలోని వర్కాల పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా పనిచేస్తోంది. ఒకప్పుడు ఇదే వర్కాల వీధుల్లో సాధారణ విక్రేతగా ఉన్న తాను పోలీస్ ఇన్ స్పెక్టర్ గా తిరిగిరావడం మాటల్లో వర్ణించలేనని పేర్కొంది. మొత్తమ్మీద గర్వంగా ఫీలవుతున్నానని వెల్లడించింది.
కాగా, ఆనీ కాపురం వదిలేసుకుని వచ్చేయడాన్ని ఆమె తల్లిదండ్రులు హర్షించలేదు. ఆమె తండ్రి ఇప్పటికీ మాట్లాడడట. తల్లి మాత్రం కుమార్తె మనసు తెలుసుకుని గత రెండేళ్లుగా ఆనీతోనే ఉంటోంది. తాను గతంలో చేసుకున్నది పెద్దలు కుదిర్చిన పెళ్లి కాకపోవడంతో, ఆ పెళ్లి విచ్ఛిన్నమైనప్పుడు తల్లిదండ్రులు తన నిర్ణయాన్ని స్వాగతించలేదని ఆనీ తెలిపింది. చంటిబిడ్డతో కలిసి తన బామ్మ వద్ద ఉంటూ బతుకుదెరువు కోసం అనేక పనులు చేశానని చెప్పింది.
ప్రస్తుతం తాను ధరిస్తున్న పోలీస్ యూనిఫాం విలువ తనకు తెలుసని, ఆ యూనిఫాం తనకే కాకుండా తనలాంటి ఎంతో మంది ఇతర స్త్రీలకు, వృద్ధ మహిళలకు కూడా రక్షణ ఇస్తుందని పేర్కొంది.