Vijayasai Reddy: దేవుడి సొమ్ము దోచుకున్నావు కదయ్యా పూసపాటి అశోకు!: విజయసాయిరెడ్డి
- సింహాచలం భూముల అంశంలో విజయసాయి స్పందన
- 748 ఎకరాలు వదులుకున్నట్టు పేర్కొంటున్నారని వెల్లడి
- మీడియాలో తప్పుగా రాస్తున్నారని ఆరోపణ
- వదులుకున్నది 840 ఎకరాలని స్పష్టీకరణ
సింహాచలం, మాన్సాస్ ట్రస్టు తాజా పరిణామాలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి స్పందించారు. సింహాచలం దేవస్థానం గతంలో వదులుకున్న భూములపై మీడియాలో అసత్య కథనాలు వస్తున్నాయని పేర్కొన్నారు. 2016లో సింహాచలం దేవస్థానం వదులుకున్న భూమి 748 ఎకరాలని మీడియా గత రెండు రోజులుగా రాస్తోందని, అయితే నాడు సింహాచలం దేవస్థానం వదులుకున్నది ఐదు గ్రామాల్లో 840 ఎకరాలని విజయసాయి స్పష్టం చేశారు. మీడియా రాస్తున్న దానికంటే దాదాపు 100 ఎకరాలు ఎక్కువని వెల్లడించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. అంతేకాదు, ఆ భూముల వివరాలను కూడా పంచుకున్నారు.
"2010లో 11,118 ఎకరాలు ఉండగా, 2016 నాటికి 10,278 ఎకరాలే మిగిలాయి. అంటే 840 ఎకరాల భూములను దేవస్థానం తమవి కాదంటూ హక్కులు వదులుకుంటున్నట్టు రిజిస్టర్ లో రాసేశారు. దేవుడి సొమ్ము దోచుకున్నావు కదయ్యా పూసపాటి అశోకు!" అంటూ విమర్శించారు.