CM KCR: దళితుల అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాం... దళిత మేధావి వర్గం కలిసిరావాలి: సీఎం కేసీఆర్
- సీఎం దళిత్ ఎంపవర్ మెంట్ సదస్సు నిర్వహణ
- సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపిన మేధావులు
- దళితుల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామన్న కేసీఆర్
- సూచనలు, సలహాలు ఇవ్వాలని మేధావులకు పిలుపు
దళితుల అభ్యున్నతే పరమావధిగా సీఎం దళిత్ ఎంపవర్ మెంట్ సదస్సు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో, దళిత మేధావులు నేడు సీఎం కేసీఆర్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమతో కలిసి రావాలంటూ దళిత మేధావి వర్గానికి పిలుపునిచ్చారు. తెలంగాణ దళిత సమాజాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచి, దళితుల జీవితాల్లో గుణాత్మక మార్పును రాబట్టేందుకు రాష్ట్ర సర్కారు చిత్తశుద్ధితో కృషి చేస్తోందని తెలిపారు. తమ లక్ష్య సాధనలో దళిత మేధావి వర్గం కూడా సహకరించాలని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.
తొలుత రూ.1200 కోట్లతో ప్రారంభించి, రాబోయే కాలంలో రూ.40 వేల కోట్లతో అమలు చేయబోతున్న సీఎం దళిత సాధికారత పథకం కోసం పటిష్ఠమైన కార్యాచరణ రూపొందిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యాచరణకు ఉపయోగపడేలా తగిన సూచనలు, సలహాలు అందించాలని దళిత మేధావులను కోరారు.
ఇవాళ సీఎం కేసీఆర్ ను కలిసిన దళిత మేధావుల్లో ఎస్సీ, ఎస్టీ జాతీయ మేధావుల ఫోరం, మాదిగ మేధావుల ఫోరం, మాదిగ విద్యావంతుల వేదిక, ఉస్మానియా యూనివర్సిటీ నాన్ టీచింగ్ స్టాఫ్ వెల్ఫేర్ అసోసియేషన్, ఇతర దళిత సంఘాల అధ్యక్ష కార్యదర్శులు, ప్రొఫెసర్లు, ఇతర మేధావులు ఉన్నారు.