Raj Nath Singh: రేపు లడఖ్ లో పర్యటించనున్న రాజ్ నాథ్ సింగ్
- పర్యటన ఒకరోజుకు పైగా కొనసాగే అవకాశం
- వాస్తవాధీన రేఖ వద్దకు కూడా వెళ్లే అవకాశం
- ఇండియా, చైనాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు
భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ రేపు కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్ లో రేపు పర్యటించనున్నారు. ఆయన పర్యటన ఒకరోజుకు పైగా కొనసాగే అవకాశం ఉంది. అయితే, చైనా సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ వద్దకు కూడా ఆయన వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. సరిహద్దుల్లో చైనా ఇప్పటికీ రెచ్చగొట్టే ధోరణిలో వ్యవహరిస్తున్న తరుణంలో ఆయన పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.
మరోవైపు సరిహద్దుల్లో ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్న చైనా... ఇదే సమయంలో భారత్ నే నిందిస్తోంది. గత వారం చైనా విదేశాంగశాఖ స్పందిస్తూ... ఉద్రిక్తతలకు భారతే కారణమని వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలపై భారత్ వెంటనే దీటుగా స్పందించింది. గత ఏడాదిగా చైనా ఎలాంటి చర్యలకు ఒడిగట్టిందనేని అందరికీ తెలిసిన విషయమేనని చెప్పింది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో లడఖ్ పర్యటనకు రాజ్ నాథ్ వెళ్తున్నారు.