Manish Maheshwari: ట్విట్టర్ ఎండీ మనీశ్ మహేశ్వరికి కర్ణాటక హైకోర్టులో ఊరట
- ఓ వ్యక్తిపై దాడికి పాల్పడ్డాడంటూ మనీశ్ పై ఆరోపణలు
- నోటీసులు పంపిన ఘజియాబాద్ పోలీసులు
- కోర్టును ఆశ్రయించిన ట్విట్టర్ ఎండీ
- చర్యలు తీసుకోవద్దంటూ కోర్టు ఉత్తర్వులు
ఓ వ్యక్తిపై దాడికి పాల్పడ్డారంటూ ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ పోలీసులు ట్విట్టర్ ఇండియా ఎండీ మనీశ్ మహేశ్వరికి నోటీసులు పంపడం కలకలం రేపింది. దీనిపై మనీశ్ మహేశ్వరి కర్ణాటక హైకోర్టును ఆశ్రయించగా, ఆయనకు ఊరట లభించింది. ట్విట్టర్ ఎండీపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని యూపీ పోలీసులకు కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
నేరంతో తనకు సంబంధం లేదని, అయినప్పటికీ తనకు నోటీసులు పంపారని మనీశ్ మహేశ్వరి తన రిట్ పిటిషన్ లో ఆరోపించారు. తాను బెంగళూరులో నివసిస్తున్నానని, యూపీ పోలీసులు తనను వ్యక్తిగతంగా హాజరు కావాలంటున్నారని కోర్టుకు తెలిపారు. వర్చువల్ గా విచారించవచ్చని సుప్రీంకోర్టు కూడా చెప్పిందని మనీశ్ మహేశ్వరి ప్రస్తావించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న కర్ణాటక హైకోర్టు... యూపీ పోలీసులు వర్చువల్ గా విచారించవచ్చు కదా? అని సూచించింది.