Tadepalli: తాడేపల్లి అత్యాచారం కేసు.. పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు!

Tadepalli Gang Rape Case police arrested two
  • నిందితులను పట్టించిన సెల్‌ఫోన్లు
  • నిందితులు ఇద్దరికీ ఇది వరకే నేర చరిత్ర
  • నిందితుల్లో ఒకడిది తాడేపల్లి, మరొకడిది చినగంజాం
  • నేడు మీడియా ఎదుట ప్రవేశపెట్టే అవకాశం 
ఏపీలో సంచలనం సృష్టించిన అత్యాచారం కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని హోం మంత్రి సుచరిత ధ్రువీకరించారు. పూర్తి విచారణ అనంతరం నేడు మీడియా ఎదుట వారిని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అత్యాచారం అనంతరం బాధితుల నుంచి వారు దోచుకున్న ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. వారిని అవే పట్టించినట్టు తెలుస్తోంది.

నిందితులు ఇద్దరూ కృష్ణానది పరిసరాలతోపాటు స్థానిక రైల్వే ట్రాక్‌ల వెంట సంచరిస్తూ రైలు ప్రయాణికులతోపాటు ఆ ప్రాంతంలో తిరిగే వారిపై దాడులు చేసి దోచుకుంటుంటారని, ఆ సొమ్ముతో మద్యం, గంజాయితోపాటు ఇతర మత్తు పదార్థాలు కొనుక్కుంటారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. వీరిపై తాడేపల్లి, బందరు పోలీస్ స్టేషన్లతోపాటు రైల్వే పోలీస్ స్టేషన్‌లోనూ పలు కేసులు నమోదై ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు.

నిందితుల్లో ఒకరిది తాడేపల్లి కాగా, మరొకడిది ప్రకాశం జిల్లాలోని చినగంజాం. ఈ నెల 19న రాత్రి బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడిన తర్వాత నిందితులు ఇద్దరూ పడవలో తాడేపల్లికి చేరుకున్నారు. కేసును పోలీసులు చురుగ్గా దర్యాప్తు చేస్తుండడంతో అక్కడి నుంచి పరారయ్యారు. నిందితుల్లో ఒకడు ఈ నెల 17న తాడేపల్లిలో మద్యం తాగి హంగామా చేయగా, పోలీసులు అదుపులోకి తీసుకుని విడిచిపెట్టారు.

బాధితుల నుంచి దోచుకున్న ఫోన్లే నిందితులను పట్టించాయి. తాడేపల్లికి చెందిన ఓ మహిళ నిన్న ఫోన్ ఆన్ చేయడంతో టవర్ లొకేషన్ కారణంగా గుర్తించిన పోలీసులు ఆమెను పిలిపించి విచారించారు. తన భర్త తాపీమేస్త్రీ అని, విజయవాడలోని ఓ వ్యక్తి నుంచి ఫోన్‌ను తన భర్త కొనుగోలు చేశాడని ఆమె పోలీసులకు చెప్పడంతో నిందితులే దానిని విక్రయించినట్టు పోలీసులు గుర్తించి వలపన్ని పట్టుకున్నారు. కాగా, బాధితురాలికి ప్రభుత్వం ప్రకటించిన రూ. 5 లక్షల పరిహారాన్ని నిన్న గుంటూరు జీజీహెచ్‌లో బాధితురాలి తల్లికి హోంమంత్రి సుచరిత అందించారు.
Tadepalli
Guntur District
Krishna District
China Ganjam
Rape case
Andhra Pradesh

More Telugu News