Vijayashanti: కేసీఆర్ పిచ్చి పర్యటనల వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదు: విజయశాంతి

Vijayasanthi comments on CM KCR visits

  • ఇటీవల కరోనా నుంచి కోలుకున్న సీఎం కేసీఆర్
  • ఆపై వరుసగా పర్యటనలు
  • విమర్శలు గుప్పించిన విజయశాంతి
  • ఇవి కాలక్షేపం పర్యటనలని వెల్లడి
  • వీటి వల్ల ప్రయోజనం లేదని వ్యాఖ్యలు

ఇటీవల కరోనా బారిన పడి, కోలుకున్న తర్వాత సీఎం కేసీఆర్ విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. మొన్న ఆసుపత్రులను తనిఖీ చేయడం, నిన్న యాదాద్రి పుణ్యక్షేత్రం సందర్శన, ఆపై జిల్లాలో పర్యటనలతో ముందుకెళుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేత విజయశాంతి స్పందించారు. కేసీఆర్ పర్యటనలు ఆప్రకటిత ఎమర్జెన్సీని తలపిస్తున్నాయని, ఈ పిచ్చి పర్యటనలు, మోసపూరిత వాగ్దానాల వల్ల ప్రజలకు ఒరిగేదేమీలేదని వ్యాఖ్యానించారు.

అరెస్టులు, వేధింపుల కోసమే అన్నట్టుగా కేసీఆర్ పర్యటన ఉందని ఆరోపించారు. ప్రజల్ని రోడ్లపైకి రానివ్వకుండా ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకోవడం కేసీఆర్ కే చెల్లిందని విజయశాంతి విమర్శించారు. కేసీఆర్ జిల్లాలకు వస్తే ఇంత నిర్బంధం ఉంటుందా? అని ప్రజలు అనుకుంటున్నారని, దానికంటే ఆయన ఫాంహౌస్ లో ఉంటేనే నయం అని వారు భావిస్తున్నారని వెల్లడించారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో కేసీఆర్ కు అక్కడికి వెళ్లే ధైర్యం లేకనే అటుపక్క సిద్ధిపేట జిల్లా, ఇటు వరంగల్ జిల్లా, ఆ పక్కనున్న యాదాద్రి జిల్లా పర్యటన చేస్తున్నాడన్న అభిప్రాయం కలుగుతోందని విజయశాంతి తెలిపారు.

కేసీఆర్ పర్యటనలో కొందరు పోలీసు అధికారులు కనీసం ప్రతిపక్ష నాయకులన్న గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారని, అది వారికీ మంచిది కాదని హితవు పలికారు. అయినా ఇవి కాలక్షేపం పర్యటనలు మాత్రమేనని, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అంటూ ముఖ్యమంత్రి ప్రచార ఆర్భాటం తప్ప, ఈ పర్యటన వల్ల నిరుద్యోగుల గతి మారుతుందన్నది ఏమీ లేదని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News