Mamata Banerjee: మమతా బెనర్జీ పిటిషన్ విచారణ నుంచి తప్పుకున్న సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ అనిరుద్ధా బోస్
- నారదా కుంభకోణంలో ఇద్దరు మంత్రులను అదుపులోకి తీసుకున్న సీబీఐ
- కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని హైకోర్టును కోరిన సీబీఐ
- సీబీఐ పిటిషన్ ను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన మమత
నారదా కుంభకోణం బెంగాల్ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఈ కేసుకు సంబంధించిన సీబీఐ విచారణ వేగవంతం కావడం అధికార టీఎంసీకి ఇబ్బందులను కలగజేస్తోంది. ఈ కేసుకు సంబంధించి మమత పార్టీకి చెందిన ఇద్దరు మంత్రులు ఫార్హాద్ హకీం, సుబ్రతా ముఖర్జీలను ఇటీవలే సీబీఐ అదుపులోకి తీసుకుంది.
అయితే వీరి అరెస్టును నిరసిస్తూ మమత సీబీఐ కార్యాలయంలో ఒక రోజంతా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడి వల్ల ఈ కేసు విచారణను తాము సజావుగా కొనసాగించలేకపోతున్నామని... కేసు విచారణను బెంగాల్ వెలుపలకు బదిలీ చేసేలా ఆదేశాలను ఇవ్వాలని రాష్ట్ర హైకోర్టును సీబీఐ కోరింది.
సీబీఐ విన్నపం పట్ల మమతా బెనర్జీ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసును బెంగాల్ వెలుపలకు బదిలీ చేయవద్దంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. మమత పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించడంతో... ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును జస్టిస్ అనిరుద్ధా బోస్, జస్టిస్ హేమంత గుప్తాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనానికి సుప్రీంకోర్టు కేటాయించింది. అయితే, ఈ కేసు విచారణ నుంచి అనిరుద్ధా బోస్ ఈ రోజు తప్పుకున్నారు. కోల్ కతాకు చెందిన ఆయన... ఈ కేసు వాదనలను తాను వినాలనుకోవడం లేదని చెప్పారు. దీంతో, ఈ పిటిషన్ విచారణను వేరే ధర్మాసనానికి బదిలీ చేయాలని మరో న్యాయమూర్తి జస్టిస్ హేమంత గుప్తా సుప్రీంకోర్టు రిజిస్ట్రీని కోరారు.
ఎన్నికల అనంతరం బెంగాల్ లో చెలరేగిన హింసకు సంబంధించి కేసు విచారణ నుంచి జస్టిస్ ఇందిరా బెనర్జీ ఇటీవలే తప్పుకున్నారు. ఈమె కూడా బెంగాల్ కు చెందనవారే కావడం గమనార్హం. బెంగాల్ కు చెందిన కేసుల విచారణ నుంచి ఆ రాష్ట్రానికి చెందిన న్యాయమూర్తులు వరుసగా తప్పుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.