USA: సముద్రంలో 18 వేల కిలోల బాంబు పేలితే ఎలా ఉంటుంది?.. వీడియో ఇదిగో!
- సముద్రంలో పరీక్షించిన అమెరికా నేవీ
- కొత్త నౌకల పటిష్ఠతను తెలుసుకునేందుకు టెస్ట్
- జలచరాలకు నష్టం లేకుండానే చేశామని వెల్లడి
ఓ 18 వేల కిలోల పెద్ద బాంబును నడిసంద్రంలో పేలిస్తే ఎలా ఉంటుంది! ఆ నీళ్లు ఎంతెత్తుకు ఎగిసి పడాలి! దాని ప్రభావం ఎన్ని కిలోమీటర్లుండాలి! దానినే అమెరికా నౌకాదళం టెస్ట్ చేసింది. యూఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ (సీవీఎన్78) నౌక పై నుంచి అట్లాంటిక్ మహా సముద్రంలో తొలి పేలుడు పరీక్షను నిర్వహించింది.
40 వేల పౌండ్ల (సుమారు 18,143 కిలోలు) బరువున్న బాంబును సముద్రం అడుగు భాగాన పేల్చింది. ఫుల్ షిప్ షాక్ ట్రయల్స్ లో భాగంగా కొత్త నౌకలు బాంబు పేలుళ్ల ధాటికి ఎలా తట్టుకుంటాయో తెలుసుకునేందుకు, వాటి యుద్ధ సన్నద్ధతను బేరీజు వేసుకునేందుకు ఈ పరీక్షను నిర్వహించింది.
జలచరాలు, పర్యావరణానికి ఎలాంటి నష్టం లేకుండానే అమెరికా తూర్పు తీరంలో ఈ పరీక్ష చేసినట్టు అమెరికా నౌకాదళం ప్రకటించింది. అయితే, పేలుడు ధాటికి సముద్రం నీళ్లు అల్లంతెత్తుకు ఎగిసిపడ్డాయి. దాని తరంగాలు చాలా దూరం వరకు విస్తరించాయి.