Vamshdhara Tribunal: వంశధారపై ఏపీ, ఒడిశా ప్రభుత్వాలకు ట్రైబ్యునల్ దిశానిర్దేశం
- వంశధార జలాలపై ఏపీ, ఒడిశా మధ్య విభేదాలు
- నేరడి నీటి పంపకాలపై గతంలోనే కేంద్రం పిటిషన్
- ఏపీ ప్రతిపాదనపై ఒడిశా సర్కారు పిటిషన్
- రెండు పిటిషన్లపై విచారణ జరిపిన వంశధార ట్రైబ్యునల్
వంశధార నదీ జలాలు, నేరడి ప్రాజెక్టు నీటి వాటాలపై ఒడిశా ప్రభుత్వం, కేంద్రం దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్లపై వంశధార ట్రైబ్యునల్ నేడు విచారణ జరిపింది. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనల ప్రకారం 106 ఎకరాల్లో నేరడి ప్రాజెక్టు నిర్మాణం సాధ్యం కాదని, ఇప్పటివరకు ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి ప్లాన్ ను తమకు ఇవ్వలేదని ఒడిశా తన పిటిషన్ లో పేర్కొంది. నేరడి నీటి వాటాలపై వివరణ కావాలని కేంద్రం ఇంతకుముందే పిటిషన్ వేసింది.
వీటిపై విచారణ జరిపిన ట్రైబ్యునల్... వంశధార జలాల తగ్గుదల, పెరుగుదలతో సంబంధం లేకుండా నదీజలాలను చెరిసగం వాడుకోవాలని పేర్కొంది. గతంలో కుదిరిన ఒప్పందం (115 టీఎంసీ అంచనాలు) మేరకు ఏపీ, ఒడిశా పంపకాలు చేసుకోవాలని స్పష్టం చేసింది. ఏపీ సర్కారు నేరడి ప్రాజెక్టు (రిటైనింగ్ వాల్ నిర్మాణం) కోసం ప్రతిపాదించిన 106 ఎకరాల భూమిని ఒడిశా సర్కారు సేకరించి ఇవ్వాలని ఆదేశించింది.
ఇక, రెండు రాష్ట్రాల జల వివాదాల కోసం స్పెషల్ అప్పిల్లేట్ అథారిటీ అవసరంలేదని ట్రైబ్యునల్ వివరించింది. అప్పీళ్లను సమీక్షించే అధికారం కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి ఉంటుందని తెలిపింది.