IT Rules: కొత్త ఐటీ నిబంధనలపై ఐరాస అవగాహన తప్పు, అవాస్తవం: కేంద్ర ప్రభుత్వం
- సోషల్ మీడియా నియంత్రణకు ప్రభుత్వం కొత్త నిబంధనలు
- తప్పుబట్టిన యూఎన్‌హెచ్‌ఆర్సీలోని ప్రత్యేకశాఖ
- మానవ హక్కుల నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని వ్యాఖ్య
- తప్పుబట్టిన కేంద్ర ప్రభుత్వం
- సామాన్యుల సాధికారత, బాధితుల రక్షణకే నిబంధనలని వివరణ
కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన కొత్త ఐటీ నిబంధనలపై ఐక్యరాజ్యసమితిలోని మానవ హక్కుల విభాగానికి చెందిన ప్రత్యేక శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఇవి అంతర్జాతీయ మానవ హక్కుల నిబంధనలకు అనుగుణంగా లేవని వ్యాఖ్యానిస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. సమాచారాన్ని నియంత్రించేలా నిబంధనలు ఉన్నాయని ఆరోపించింది.
ఐరాస వ్యాఖ్యల్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా తప్పుబట్టింది. యూఎన్‌హెచ్‌ఆర్‌సీ ప్రత్యేక శాఖ వ్యాఖ్యలు ‘‘తప్పుగా, అతిశయోక్తిగా, అవాస్తవంగా ఉన్నాయి’’ అని స్పష్టం చేసింది. భారత ప్రజాస్వామ్య మూలాల్ని గుర్తు చేసిన సర్కార్.. రాజ్యాంగంలో వాక్ స్వేచ్ఛను స్వతంత్ర న్యాయవ్యవస్థ, శక్తిమంతమైన మీడియా రక్షణల ద్వారా పటిష్ఠం చేశారని గుర్తుచేసింది. సామాజిక మాధ్యమాలను వినియోగించే సామాన్య ప్రజలకు మరింత సాధికారత అందించడానికి, సోషల్ మీడియా వేదికల వల్ల బాధితులుగా మారుతున్న వారికి న్యాయం జరిగేలా కొత్త నిబంధనల ద్వారా ఓ వ్యవస్థను మాత్రమే నెలకొల్పామని వివరించింది.