NIC Email: ఎన్ఐసీ ఈమెయిల్ వ్యవస్థలో ఎలాంటి చొరబాట్లు జరగలేదు: కేంద్రం
- ఎన్ఐసీ ఈమెయిళ్లు హ్యాకర్ల పరం అంటూ కథనాలు
- స్పష్టత ఇచ్చిన కేంద్రం
- ఎన్ఐసీ వ్యవస్థ అత్యంత సురక్షితమైనదని వెల్లడి
- ఎన్నో భద్రతా ఏర్పాట్లు ఉంటాయని వివరణ
కేంద్ర ప్రభుత్వ అధికారిక ఈమెయిల్ వ్యవస్థ ఎన్ఐసీ (నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్) లోకి హ్యాకర్లు చొరబడ్డారన్న ప్రచారంపై కేంద్రం స్పష్టత ఇచ్చింది. ఎన్ఐసీ ఈమెయిల్ వ్యవస్థ ఎంతో భద్రంగా ఉందని, ఎలాంటి డేటా చొరబాట్లు జరగలేదని వెల్లడించింది. ఎన్ఐసీ నిర్వహిస్తున్న ఈమెయిల్ వ్యవస్థ అత్యంత సురక్షితమైనదని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ తెలిపింది.
ఎయిరిండియా, బిగ్ బాస్కెట్, డొమినోస్ సంస్థల్లో భద్రతా లోపాల ద్వారా ఎన్ఐసీ ఈమెయిల్ ఖాతాలు, పాస్ వర్డ్ లు బహిర్గతమయ్యాయని, అవి హ్యాకర్ల పరమయ్యాయని జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని పేర్కొంది. బయటి సంస్థల భద్రతా లోపాల కారణంగా తలెత్తే సమస్యల వల్ల కేంద్ర ప్రభుత్వ ఈమెయిల్ వ్యవస్థలకు ఎలాంటి ప్రమాదం లేదని ఐటీ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ఒకవేళ ప్రభుత్వ ఈమెయిల్ వినియోగదారులు ఆయా బయటి పోర్టళ్లలో తమ అధికారిక ఐడీ, పాస్ వర్డ్ తో లాగిన్ అయితే తప్ప... సాధారణ పరిస్థితుల్లో ఎన్ఐసీ ఈమెయిల్ వ్యవస్థల్లోకి చొరబడడం ఏమంత సులువు కాదని వివరించింది.
ఎన్ఐసీ ఈమెయిల్ వ్యవస్థలో రెండంచెల భద్రత (2 ఫ్యాక్టర్ అథెంటికేషన్) వంటి అనేక ఏర్పాట్లు ఉంటాయని, ప్రతి 90 రోజులకు పాస్ వర్డ్ మార్చుకోవాల్సి ఉంటుందని తెలిపింది. పాస్ వర్డ్ మార్చుకోవాలంటే మొబైల్ కు వచ్చే ఓటీపీ ఎంతో కీలకమని పేర్కొంది. ఓటీపీ లేకుండా పాస్ వర్డ్ మార్చుకోలేరని, ఎన్ఐసీ తన వినియోగదారులకు ఎప్పటికప్పుడు అవగాహన కలిగిస్తుంటుందని వెల్లడించింది.