Inscriptions: శ్రీశైలంలో ఓ మఠం వద్ద 18 ప్రాచీన తామ్ర శాసనాలు లభ్యం
- ఘంటామఠం వద్ద పునరుద్ధరణ పనులు
- తవ్వకాల్లో బయటపడ్డ రాగి శాసనాలు
- తెలుగు, నంది నాగరి లిపిలో శాసనాలు
- పరిశీలించిన అధికారులు
ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో మరోసారి ప్రాచీన కాలం నాటి వస్తువులు బయల్పడ్డాయి. శ్రీశైలంలోని ఘంటామఠం వద్ద 18 ప్రాచీన తామ్ర (రాగి) శాసనాలు లభ్యమయ్యాయి. ఈ తామ్ర శాసనాలు తెలుగు, నంది నాగరి లిపిలో ఉన్నట్టు గుర్తించారు. ఈ తామ్ర శాసనాల్లోనే మరికొన్ని లిపిలను గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. శ్రీశైల ఆలయ ఈవో రామారావు, ఆర్డీవో హరిప్రసాద్, సీఐ బీవీ రమణ తామ్ర శాసనాలను పరిశీలించారు.
కాగా, వీటిని కొన్ని వందల ఏళ్ల నాటివిగా భావిస్తున్నారు. ఘంటామఠం వద్ద పునరుద్ధరణ పనులు జరుగుతుండగా, తవ్వకాల్లో ఇవి బయటపడ్డాయి. గతంలో ఇక్కడ పలు ప్రాచీన కట్టడాలు, నాణేలు, ఇతర వస్తువులను గుర్తించారు. అప్పట్లో ఇదే ఘంటామఠం వద్ద బంగారం, వెండి ఆభరణాల రూపంలో లభ్యం కావడం బాగా ప్రాచుర్యం పొందింది.