Raghu Rama Krishna Raju: వృద్ధాప్య పింఛన్లపై.. ఏపీ సీఎం జగన్‌కు రఘురామకృష్ణరాజు లేఖ!
- వృద్ధుల పింఛన్లను పెంచాలి
- ఈ నెల నుంచి రూ.2,750 ఇవ్వాలి
- ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి
- హామీని నమ్మే ప్రజల నుంచి మద్దతు లభించింది
పింఛన్లు అందక వృద్ధులు ఎదుర్కొంటోన్న సమస్యలను వివరిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు వైసీపీ అసంతృప్త ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. ఈ నెల నుంచి పింఛన్లను రూ.2,750కు పెంచి ఇవ్వాలని ఆయన కోరారు. అంతేగాక, ఏడాదిగా పెండింగ్‌లో ఉన్న పింఛన్ల డబ్బులు కూడా కలిపి రూ.3,000 వేల చొప్పున ఇవ్వాలని పేర్కొన్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని రఘురామకృష్ణరాజు చెప్పారు. పింఛన్లను రూ.2,000 నుంచి రూ.3,000కు పెంచుతామని అప్పట్లో హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. అందుకే ప్రజల నుంచి వైసీపీకి పూర్తి మద్దతు లభించిందని చెప్పారు. ఇప్పటికైనా హామీని నిలబెట్టుకోవాలని సూచించారు.