Telangana: తెలంగాణ హైకోర్టులో పెరగనున్న న్యాయమూర్తుల సంఖ్య.. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ కీలక నిర్ణయం
- న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలంటూ రెండేళ్లుగా విజ్ఞప్తులు
- న్యాయమూర్తుల సంఖ్యను 75 శాతానికి పెంచిన జస్టిస్ రమణ
- 42కు పెరగనున్న టీఎస్ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య
వివిధ రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో ఇటీవల రెండు రోజులపాటు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటీ అయిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ కీలక నిర్ణయం తీసుకున్నారు. న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలంటూ తెలంగాణ హైకోర్టు నుంచి రెండేళ్లుగా వస్తున్న విజ్ఞప్తులను పరిశీలించిన ఆయన సానుకూలంగా స్పందించారు.
ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 75 శాతానికి పెంచారు. ఫలితంగా టీఎస్ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 42కు పెరగనుంది. హైకోర్టులో పేరుకుపోయిన కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీజేఐ కార్యాలయం తెలిపింది. అలాగే, వివిధ రాష్ట్రాల హైకోర్టుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను కూడా జస్టిస్ రమణ పరిశీలిస్తున్నారని ఆయన కార్యాలయం పేర్కొంది.