UN: ఐరాస సెక్రటరీ జనరల్‌గా గుటెరస్ కొనసాగింపునకు భద్రతా మండలి ఆమోదం
- సర్వప్రతినిధుల సభ ఆమోదమే తరువాయి
- గుటెరస్ ఎన్నిక లాంఛనమే
- 2017లో తొలిసారి పదవిలోకి
- కరోనా సవాళ్ల నడుమ రెండో దఫా
ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శిగా ఆంటోనియో గుటెరస్‌ను వరుసగా రెండోసారి కొనసాగించేందుకు భద్రతా మండలి ఆమోదం తెలిపింది. మంగళవారం రహస్యంగా జరిగిన సమావేశంలో సభ్య దేశాలు ఏకగ్రీవంగా గుటెరస్ వైపే మొగ్గుచూపినట్లు మండలి ప్రస్తుత అధ్యక్షుడు, ఎస్టోనియా రాయబారి స్వెన్ జర్గెన్సన్ వెల్లడించారు. ఇక గుటెరస్ రెండోసారి ఆ పదవిలో కొనసాగేందుకు సర్వప్రతినిధి సభ ఆమోదం తెలిపాల్సి ఉంది. అయితే, మండలి ఆమోదం లభిస్తే ఇక ప్రతినిధుల సభ అంగీకారం లాంఛనప్రాయమే.
ఈ పదవికి మరో 10 మంది పోటీ పడినప్పటికీ.. వారెవరికీ ఐరాసలోని సభ్యదేశాల మద్దతు లేకపోవడం గమనార్హం. ఒక రకంగా గుటెరస్ ఎలాంటి పోటీ లేకుండానే రెండోసారి జనరల్ సెక్రటరీగా ఎన్నిక కానున్నారు. గతంలో పోర్చుగల్ ప్రధానిగా వ్యవహరించిన ఆయన 2017లో ఐరాస బాధ్యతలు స్వీకరించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకపక్ష, జాతీయవాద విధానంతో ఇబ్బందులు ఎదుర్కొన్న గుటెరస్ ఈసారి కరోనా, దాని మూలంగా ఉద్భవించిన వివిధ సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది.