Mohan Babu: చిరంజీవి సహృదయతకు నా హృదయపూర్వక ధన్యవాదాలు: మోహన్ బాబు
- 'సన్ ఆఫ్ ఇండియా' సినిమాకు వాయిస్ ఓవర్ అవసరమైంది
- అడగ్గానే చిరంజీవి ఒప్పుకున్నారు
- ఆయనే థియేటర్ బుక్ చేసుకుని వాయిస్ ఓవర్ చెప్పారు
తన మిత్రుడు మెగాస్టార్ చిరంజీవిపై డైలాగ్ కింగ్ మోహన్ బాబు ప్రశంసలు కురిపించారు. తాను 'సన్ ఆఫ్ ఇండియా' తీస్తున్నాననే సంగతి అభిమానులకు, ప్రేక్షకులకు తెలుసని... ఈ చిత్రానికి ప్రారంభంలో వాయిస్ ఓవర్ అవసరమైందని మోహన్ బాబు చెప్పారు.
దీంతో, వాయిస్ ఓవర్ కు చిరంజీవి అంకుల్ వాయిస్ అయితే బాగుంటుందని తన కుమారుడు విష్ణు చెప్పాడని... వెంటనే చిరంజీవికి ఫోన్ చేసి తాను అడిగానని తెలిపారు. దీనిపై చిరంజీవి వెంటనే స్పందించారని... ఎన్నిరోజుల్లో కావాలి బాబు? అని అడిగారని... పది రోజుల్లో ఎప్పుడైనా ఓకే అన్నానని చెప్పారు. వాయిస్ ఓవర్ మ్యాటర్ పంపమని చిరంజీవి అడిగారని... తాను పంపించానని తెలిపారు.
'ఆచార్య' సినిమా పనులతో బిజీగా ఉన్నప్పటికీ... తాను అడిగిన మూడు రోజుల్లోనే తనే థియేటర్ బుక్ చేసి, తనే డబ్బింగ్ చెప్పి పంపాలనుకున్నాడు. ఆ విషయం తెలిసి, విష్ణును అక్కడకు పంపానని మోహన్ బాబు చెప్పారు. విష్ణును చూసిన చిరంజీవి నవ్వుతూ... నిన్నెవరు రమ్మన్నారని అన్నాడని తెలిపారు. డబ్బింగ్ పూర్తి చేసి నాన్నకి సర్ ప్రైజ్ ఇద్దామనుకున్నానని చెప్పాడని అన్నారు.
ఇంత గొప్ప మనసు ఎవరికుంటుందని మోహన్ బాబు ప్రశంసించారు. తాను అడగ్గానే ఇంత గొప్పగా స్పందించిన చిరంజీవి తీరుకు, అతని సహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పారు. ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేసిన హీరో సూర్యకు ధన్యవాదాలు తెలిపారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్ డేట్స్ తో అభిమానుల ముందుకు వస్తానని చెప్పారు.