Jagan: పాలు పోసే అక్కచెల్లెమ్మలంతా అమూల్ లో వాటాదారులే: సీఎం జగన్
- పశ్చిమ గోదావరి జిల్లాలో జగనన్న పాడి వెల్లువకు శ్రీకారం
- పాదయాత్రలో పాడిరైతుల కష్టాలు చూశానన్న సీఎం
- అమూల్ తో లాభదాయకం అని వెల్లడి
- త్వరలోనే రాష్ట్రవ్యాప్తం చేస్తామని వివరణ
పశ్చిమ గోదావరి జిల్లాలో జగనన్న పాల వెల్లువ పథకానికి శ్రీకారం చుట్టామని ఏపీ సీఎం జగన్ వెల్లడించారు. పాదయాత్రలో పాడి రైతుల కష్టాలు చూశానని తెలిపారు. లీటర్ పాల ధర కంటే లీటర్ నీళ్ల ధరే ఎక్కువ ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారని సీఎం జగన్ వివరించారు. ఇచ్చిన హామీ మేరకు పాడిరైతుల కోసం అమూల్ ప్రాజెక్టును తీసుకొచ్చామని చెప్పారు. ఇకపై పాలు పోసే అక్కచెల్లెమ్మలంతా అమూల్ సంస్థలో వాటాదారులేనని ఉద్ఘాటించారు.
పాల సేకరణలో చెల్లించే ధరలు... మిగిలిన సంస్థల కంటే అమూల్ సంస్థలోనే ఎక్కువ అని స్పష్టం చేశారు. అమూల్ ద్వారా పాడిరైతులకు మంచి లాభాలు వస్తున్నాయని వివరించారు. ఇప్పటికే ప్రకాశం, కడప, చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో పాల సేకరణ జరుగుతోందని సీఎం తెలిపారు. నేటి నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలోని 153 గ్రామాల్లో అమూల్ సంస్థ పాల సేకరణ చేపడుతుందని అన్నారు. రాష్ట్రంలో 9,899 గ్రామాలకు అమూల్ ను విస్తరిస్తామని వెల్లడించారు.
పాడిరైతులకు లబ్ది చేకూరేలా లీటరుకు అదనంగా రూ.5 నుంచి రూ.15 వరకు వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. 13,739 మంది అక్కచెల్లెమ్మలకు ఇప్పటివరకు అదనంగా 4 కోట్ల 6 లక్షల రూపాయలు వచ్చినట్టు తెలిపారు. పాడిరైతులకు 10 రోజులకు ఒకసారి బిల్లు చెల్లింపులు జరుగుతాయని చెప్పారు. ఏఎంసీ, బీఎంసీ వద్ద పాలు పోసిన వెంటనే నాణ్యత తెలిపే స్లిప్ ఇస్తారని, ఆ స్లిప్ ఆధారంగా ప్రతి లీటరు ధరపై అదనంగా గరిష్ఠంగా రూ.15 వరకు వస్తుందని సీఎం జగన్ వివరించారు. పాడిరైతుల కోసం ఈ రెండేళ్లలో రూ.4 వేల కోట్లు ఖర్చు చేశామని పేర్కొన్నారు.