Yousufali: యుఏఈలో మరణశిక్ష పడిన భారతీయుడ్ని కాపాడిన లులూ గ్రూప్ అధినేత

Lulu group MD saves a man life

  • 2012లో  బాలుడి మృతికి కారణమైన కృష్ణన్
  • కారు నిర్లక్ష్యంగా నడిపాడంటూ అభియోగాలు
  • మరణశిక్ష విధించిన యూఏఈ సుప్రీంకోర్టు
  • లులూ గ్రూప్ అధినేతను కలిసిన కృష్ణన్ కుటుంబం
  • రూ.1 కోటి చెల్లించడంతో మరణశిక్ష రద్దు

మరణశిక్ష ఖరారైన వ్యక్తికి తన శిక్ష రద్దయిందని తెలిస్తే... అంతకంటే అద్భుతమైన విషయం మరొకటి ఉండదేమో! భారత్ కు చెందిన బెక్స్ కృష్ణన్ (45) విషయంలో అదే జరిగింది. బెక్స్ కృష్ణన్ స్వస్థలం కేరళ. ఉపాధి నిమిత్తం గల్ఫ్ లో ఉంటున్నాడు. అయితే, 2012లో బెక్స్ కృష్ణన్ కారు నిర్లక్ష్యంగా నడపడం ద్వారా ఓ సూడాన్ బాలుడి మృతికి కారకుడయ్యాడన్న అభియోగాలపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) సుప్రీంకోర్టు మరణశిక్ష విధించింది. సీసీటీవీ ఫుటేజి, ప్రత్యక్ష సాక్షుల కథనాలన్నీ సరిపోలడంతో అతడికి మరణశిక్ష ఖరారైంది.

కృష్ణన్ ను ఈ కేసు నుంచి కాపాడాలని కుటుంబ సభ్యులు, స్నేహితులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. అప్పటికే మరణించిన బాలుడి కుటుంబ సభ్యులు సూడాన్ వెళ్లిపోవడంతో క్షమాభిక్ష ప్రయత్నాలు కూడా వీలుకాలేదు. అయితే చివరి అవకాశంగా కృష్ణన్ కుటుంబ సభ్యులు ఎన్నారై వ్యాపారవేత్త, లులూ గ్రూప్ అధినేత, పెద్దమనసున్న దాత యూసుఫ్ అలీని కలిశారు. ఎవరి సలహాతో ఆయను కలిశారో కానీ, కృష్ణన్ జీవితం నిజంగానే మలుపు తిరిగింది.

కృష్ణన్ కుటుంబ సభ్యులు చెప్పింది సావధానంగా విన్న యూసుఫ్ అలీ ఈ కేసుకు సంబంధించిన వివరాలన్నీ తెప్పించుకుని అధ్యయనం చేశారు. ఇదొక దురదృష్టకర ఘటనగా భావించిన ఆయన వెంటనే ఈ కేసులో తాను అనుసరించబోయే వైఖరి గురించి కంపెనీలోని ఇతర వాటాదారులకు తెలియజేశారు. ఆపై, సూడాన్ నుంచి బాలుడి కుటుంబ సభ్యులను సొంత ఖర్చుతో అబుదాబి రప్పించారు. అక్కడ్నించి నెలరోజుల పాటు వారితో చర్చలు జరిపి క్షమాభిక్షకు ఒప్పించారు.

ఈ ఏడాది జనవరిలో ఇరువర్గాల మధ్య ఒప్పందం కుదిరింది. క్షమాభిక్ష ప్రసాదించేందుకు సూడాన్ బాలుడి కుటుంబ సభ్యులు అంగీకరించడంతో.... లులూ గ్రూప్ అధినేత యూసుఫ్ అలీ కోర్టులో పరిహారం రూపేణా రూ.1 కోటి చెల్లించారు. దాంతో, కృష్ణన్ మరణశిక్ష రద్దయింది. ఈ కేసుకు సంబంధించిన న్యాయపరమైన, దౌత్యపరమైన అంశాలన్నీ గురువారం పూర్తయ్యాయి. ఇక త్వరలోనే కృష్ణన్ విడుదలై కేరళ వెళ్లేందుకు మార్గం సుగమం అయింది.

దీనిపై కృష్ణన్ స్పందన మామూలుగా లేదు. అసలు తాను మరణశిక్ష నుంచి తప్పించుకున్నాడంటే అతడు నమ్మలేకపోతున్నాడు. దీనికంతటికీ కారణం యూసుఫ్ అలీ అని తెలిసి, కేరళ వెళ్లేముందు ఒక్కసారి ఆయన్ని చూడాలని నిర్ణయించుకున్నాడు. ఇది తనకు పునర్జన్మ అని భావిస్తున్నాడు. అయితే, ఇంతచేసినా యూసుఫ్ అలీ మాత్రం... ఇదంతా భగవదనుగ్రహంతోనే జరిగిందని, యూఏఈ పాలకులు దయామయులు కావడంతోనే ఇది సాధ్యమైందని నమ్ముతున్నారు. కృష్ణన్ సంతోషంగా, ప్రశాంతంగా జీవించాలని ఆశిస్తున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News