Iran: సముద్రంలో మునిగిన ఇరాన్ యుద్ధ నౌక.. సిబ్బంది సేఫ్!
- ఇరాన్ నేవీకి చెందిన అతిపెద్ద యుద్ధ నౌక ‘ఖర్గ్’
- మునిగిపోవడానికి ముందు నౌకలో చెలరేగిన మంటలు
- ఇరాన్ ఓడరేవు జాస్క్ సమీపంలో ఘటన
ఇరాన్ నేవీకి చెందిన అతిపెద్ద యుద్ధ నౌక ‘ఖర్గ్’ నేడు ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగిపోయింది. అంతకుముందు అది అగ్ని ప్రమాదానికి గురైంది. అయితే, నౌక మునక వెనక ఉన్న స్పష్టమైన కారణాలు తెలియరాలేదు. నౌకలోని సిబ్బంది మొత్తం సురక్షితంగా బయటపడ్డారు. 679 అడుగుల పొడవైన ఈ నౌక మునిగిన ప్రాంతంలో ఇరాన్, ఇజ్రాయెల్ నౌకలు తరచూ దాడులకు గురవుతుండడంతో ‘ఖర్గ్’ మునకపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తెల్లవారుజామున 2.25 గంటల సమయంలో నౌకలో మంటలు ఎగసిపడ్డాయని, దీంతో అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది వాటిని అదుపు చేసే ప్రయత్నం చేశారని ప్రభుత్వ టెలివిజన్ తెలిపింది. ఆ తర్వాత కాసేపటికే నౌక మునిగిపోయింది. ఒమన్ గల్ఫ్‌లోని టెహ్రాన్‌కు ఆగ్నేయంగా 790 మైళ్ల దూరంలో ఉన్న ఇరాన్ ఓడరేవు జాస్క్ సమీపంలో ఈ ఘటన జరిగినట్టు టీవీ పేర్కొంది.