Maharashtra: మహారాష్ట్రలో ఒకే జిల్లాలో 9,928 మంది పిల్లలకు కరోనా!
- మహారాష్ట్ర అహ్మద్ నగర్ లో పెరుగుతున్న కేసులు
- 95 శాతం మందిలో లక్షణాలు లేవన్న కలెక్టర్
- ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యాఖ్య
- ఇతర జిల్లాల్లోనూ పెరుగుతున్నాయన్న మరో ఉన్నతాధికారి
కరోనా థర్డ్ వేవ్ లో పిల్లలకే ఎక్కువ ముప్పు వస్తుందని నిపుణులు ముందు నుంచీ చెబుతున్నారు. అయితే, ఇప్పటికే సెకండ్ వేవ్ లో చాలా మంది పిల్లలు దాని బారిన పడ్డారు. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో ఒక్క మే నెలలోనే 9,928 మందికిపైగా పిల్లలకు కరోనా సోకిందని ఆ జిల్లా కలెక్టర్ రాజేంద్ర భోసాలే చెప్పారు. అందులో 95 శాతం మందికి లక్షణాలేవీ లేవని, దీనిపై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు.
గత నెలలో కరోనా బారిన పడిన పిల్లల్లో 6,700 మంది 11 నుంచి 18 ఏళ్ల మధ్య వారని, మరో 3,100 మంది ఒకటి నుంచి పదేళ్ల వయసు వారని చెప్పారు. మిగతా వారు ఏడాదిలోపు వారని తెలిపారు. థర్డ్ వేవ్ లో వారికే ముప్పుందన్న సంకేతాల నేపథ్యంలో వారిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు.
ఇతర జిల్లాల్లోనూ ఎక్కువ మంది పిల్లలు కరోనా బారిన పడుతున్నారని మహారాష్ట్ర ఆరోగ్య నిఘా అధికారి ప్రదీప్ అవాతే చెప్పారు. అయితే, పిల్లల్లో మరణాలు చాలా తక్కువేనని పేర్కొన్నారు. పిల్లల్లో కరోనా మరణాల రేటు 0.04 నుంచి 0.07 శాతమేనన్నారు. తల్లిదండ్రులు లేదా ఇతర కుటుంబ పెద్దల నుంచే పిల్లలకు ఎక్కువగా కరోనా సోకుతోందన్నారు.