K V Vijayendra Prasad: రాజమౌళిని చదివించడానికి డబ్బులేకపోవడంతో ఆ మాట చెప్పాడట!
- డైరెక్టర్ కావాలనేది రాజమౌళి ఆలోచనే
- అందుకోసం ఏం చేయాలనేది నేను చెప్పాను
- ఆ మార్గంలో రాజమౌళి ముందుకు వెళ్లాడు
- రాఘవేంద్రరావుగారు అవకాశం ఇచ్చారు
రాజమౌళి దర్శకుడిగా సాధించిన విజయాలలో రచయితగా ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ పాత్ర ఉంది. తాజాగా ఆయన 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ, రాజమౌళికి సంబంధించిన విషయాలను గురించి ప్రస్తావించారు. "రాజమౌళిని డైరెక్టర్ చేయాలని నేను అనుకోలేదు .. ఆ ఆలోచన అతనికే వచ్చింది. ఇంటర్ అయిపోయిన తరువాత బీఎస్సీ చదవాలనుకున్నాడు. కానీ అప్పుడు నా ఆర్ధిక పరిస్థితి బాగోలేదు. చెన్నై వచ్చి బలాదూర్ గా తిరుగుతూ ఉండేవాడు.
"ఏం చేద్దామని అనుకుంటున్నావు?" అని ఒక రోజున నేను అడిగితే, డైరెక్షన్ పై ఇంట్రెస్ట్ ఉందని చెప్పాడు. 'డైరెక్టర్ కావడమనేది అంత తేలికైన విషయం కాదు .. డైరెక్షన్ కి సంబంధించిన అన్ని శాఖలపై పట్టు ఉండాలి. అప్పుడే నిన్ను డైరెక్షన్ డిపార్టుమెంటులో పెట్టుకోవడానికి ఎవరైనా ఇష్టపడతారు' అని చెప్పాను. ముందుగా అవి నేర్చుకో అన్నాను.
అప్పుడు ముందుగా ఎడిటింగ్ పై దృష్టి పెట్టి .. ఆ తరువాత కీరవాణి దగ్గర మ్యూజిక్ పై అవగాహన పెంచుకుని .. నా దగ్గర కూర్చుని కథలపై శ్రద్ధ పెట్టాడు. ఒక కథలో ఎక్కడ ఏయే విషయాలు చెప్పాలి? .. ఎలా చెప్పాలి? అనే విషయాలపై పట్టు సాధించాడు. అప్పుడు రాఘవేంద్రరావుగారు 'శాంతినివాసం' సీరియల్ తో అవకాశం ఇచ్చారు" అని చెప్పుకొచ్చారు.