: మొదలైన 'తానా' మహాసభలు
అమెరికాలోని తెలుగువారి అభ్యున్నతి, సంక్షేమం ధ్యేయంగా పనిచేసే తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) మహాసభలు ఘనంగా ఆరంభమయ్యాయి. భారత కాలమానం ప్రకారం ఈరోజు ఉదయం ఐదింటికి అమెరికాలోని డల్లాస్ కన్వెన్షన్ సెంటర్లో లాంఛనంగా మొదలయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ సభలకు ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి చిరంజీవి కార్యక్రమాలను ప్రారంభించారు. సభికులను సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం 'జనగణమన' ఆలపించి అందరిలోనూ జాతీయతా భావాన్ని తట్టిలేపారు. తొలి రోజు కార్యక్రమాల్లో భాగంగా 19 మంది విశిష్ట ప్రతిభావంతులకు పురస్కారాలను అందజేశారు. ఈ మహాసభలకు రాష్ట్ర మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, గంటా శ్రీనివాసరావు, సుప్రీం కోర్టు న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ హాజరయ్యారు. పలువురు సినీతారలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.