Rains: ఇంకా క్రియాశీలకంగానే ఉన్న 'యాస్'... ఏపీకి వర్ష సూచన
- భూభాగంపైకి ప్రవేశించిన యాస్ తుపాను
- బలహీనపడి అల్పపీడనంగా మారుతుందన్న వాతావరణ శాఖ
- ఉత్తరప్రదేశ్ నుంచి బీహార్ వరకు విస్తరించిందని వెల్లడి
- ఏపీలో మూడ్రోజుల పాటు వర్షాలు
- ఆదివారం భారీ వర్షాలు పడే అవకాశం
ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నడుమ తీరం దాటిన యాస్ తుపాను ఇప్పటికీ క్రియాశీలకంగానే ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తూర్పు ఉత్తరప్రదేశ్ నుంచి బీహార్ వరకు ఇది విస్తరించి ఉందని వివరించింది. ఇది రానున్న 12 గంటల్లో బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపింది.
ఇక, ఏపీలో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది. ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని, ఆదివారం నాడు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని వెల్లడించింది. అటు, నైరుతి రుతుపవనాలు ఈ నెల 31న కేరళను తాకనున్నాయని తెలిపింది.