Balakrishna: ఎన్టీఆర్‌ ఘాట్ వద్ద నివాళులర్పించిన బాలకృష్ణ.. కరోనా వల్ల రాలేకపోతున్నానన్న రామకృష్ణ

Nandamuri Balakrishna paid tribute at NTR Ghat
  • నేడు ఎన్టీఆర్ 98వ జయంతి
  • ఎన్టీఆర్ జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని బాలయ్య డిమాండ్
  • ఎన్టీఆర్ యుగపురుషుడంటూ కొనియాడిన హిందూపురం ఎమ్మెల్యే
ఎన్టీఆర్ 98వ జయంతిని పురస్కరించుకుని ఈ ఉదయం ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన తనయుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నందమూరి తారకరామారావు జీవిత చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్‌పై ఎంతోమంది పుస్తకాలు రాశారని గుర్తు చేసిన బాలకృష్ణ.. ఎన్టీఆర్ జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని ఎప్పటి నుంచో కోరుతున్నట్టు చెప్పారు. ఇదే విషయాన్ని మరోమారు డిమాండ్ చేస్తున్నట్టు చెప్పారు.

ఎన్టీఆర్ యుగపురుషుడని, పేదల పెన్నిధి అని బాలకృష్ణ కొనియాడారు. తన తండ్రి సినిమాలు చూసి తాను స్ఫూర్తి పొందానని చెప్పారు. కాగా, కరోనా కారణంగా ఈసారి ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లి నివాళులు అర్పించలేకపోతున్నానని ఆయన మరో తనయుడు రామకృష్ణ తెలిపారు. అభిమానుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. అందరూ విధిగా కరోనా నిబంధనలు పాటించాలని కోరారు.
Balakrishna
NTR
NTR Ghat
Ramakrishna

More Telugu News