Velapati Ramireddy: ప్రముఖ సాహితీవేత్త వెలపాటి రామిరెడ్డి మృతికి సీఎం కేసీఆర్ సంతాపం
- అనారోగ్యంతో కన్నుమూసిన వెలపాటి
- హన్మకొండలో నిన్న మృతి
- విచారం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్
- ఉత్తమ సాహితీవేత్తను కోల్పోయామని వ్యాఖ్యలు
ప్రముఖ సాహితీవేత్త వెలపాటి రామిరెడ్డి (89) నిన్న హన్మకొండలో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం తెలియజేశారు. తెలంగాణ పద్యకవి, ప్రభుత్వ విశిష్ట పురస్కార గ్రహీత వెలపాటి రామిరెడ్డి వ్యవసాయం, రైతు సమస్యలను తన కవిత్వం ద్వారా ఆవిష్కరించారని గుర్తు చేసుకున్నారు.
తెలంగాణే ప్రధాన వస్తువుగా వెలపాటి రచనా వ్యాసంగాన్ని సాగించారని, ఆయన మరణంతో తెలంగాణ ఒక ఉత్తమ సాహితీవేత్తను కోల్పోయిందని సీఎం కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
వెలపాటి రామిరెడ్డి స్వస్థలం జనగామ జిల్లా కొడకండ్ల మండలం రేగుల గ్రామం. వృత్తిరీత్యా అధ్యాపకుడు అయిన వెలపాటి... తెలంగాణ సాయుధ పోరాటానికి ఇంధనం అనదగ్గ సాహిత్యాన్ని సృజించి అందించారు. ఆయన రచనలకు ఇంటర్, 7వ తరగతి సిలబస్ లోనూ స్థానం కల్పించారు. నాలుగేళ్ల కిందట రాష్ట్రావతరణ వేడుకల్లో సీఎం కేసీఆర్ ఆయనను ఘనంగా సత్కరించారు.