Adimulapu Suresh: లోకేశ్ ఏం సాధించాలని పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలంటున్నారు?: మంత్రి ఆదిమూలపు సురేశ్
- ఏపీలో కరోనా విలయం
- టెన్త్ పరీక్షలు వాయిదా
- వివరణ ఇచ్చిన మంత్రి ఆదిమూలపు
- జులైలో సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడి
- విపక్షాలు వాస్తవాలు గమనించాలని హితవు
ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. జూన్ 7 నుంచి టెన్త్ పరీక్షలు జరగాల్సి ఉండగా, కరోనా ఇప్పటికీ విజృంభిస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది. దీనిపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వివరణ ఇచ్చారు.
రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతంగా ఉందని అన్నారు. వాస్తవాలను వాస్తవంగా చూడాల్సిన బాధ్యత ప్రతిపక్షాలకు ఉందని స్పష్టం చేశారు. లోకేశ్ ఏం సాధించాలని పరీక్షలు రద్దు చేయాలంటున్నారు? అంటూ ఆదిమూలపు సురేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షలు రాయకపోతే కరోనా రాదని ఏమైనా గ్యారంటీ ఉందా? అని ప్రశ్నించారు.
ఉన్నత చదువులకు ఇంటర్, టెన్త్ పరీక్షలు చాలా అవసరమని పేర్కొన్నారు. విద్యార్థులు నష్టపోకుండా పరీక్షలు నిర్వహించాలని చూస్తున్నామని తెలిపారు. కేంద్రం కూడా సీబీఎస్ఈ పరీక్షల నిర్వహణకు కసరత్తు చేస్తోందని వివరించారు. జులైలో మరోసారి సమీక్షించి పరీక్షలపై నిర్ణయం తీసుకుంటామని, కొత్త తేదీలు ప్రకటిస్తామని తెలిపారు. అప్పటివరకు టెన్త్ విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు కొనసాగుతాయని మంత్రి వెల్లడించారు.