Uttar Pradesh: అమానుషం.. మాస్కు ధరించలేదని చేతికి మేకులు గుచ్చిన పోలీసులు!
- యూపీలోని బరేలీ జిల్లాలో అమానుష ఘటన
- యువకుడిని చితకబాది మేకులు గుచ్చిన పోలీసులు
- జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితుడి తల్లి
కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేసే క్రమంలో కొందరు పోలీసులు అమానుష చర్యలకు పాల్పడుతున్నారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారు. మాస్కులు ధరించని వారికి ఏ రాష్ట్రంలో అయినా జరిమానా విధిస్తున్న సంగతి తెలిసిందే. అయితే యూపీ పోలీసులు మాత్రం బాధితుడిపై తమదైన మార్కును చూపించారు. మాస్కు ధరించని ఓ యువకుడిని చితకబాదారు. అంతేకాదు, అతని చేతికి, కాలికి మేకులు కొట్టారు. యూపీలోని బరేలీ జిల్లాలో ఈ దారుణం సంభవించింది.
పోలీసుల అరాచకానికి బలైన యువకుడి పేరు రంజిత్. అతని చేతికి, కాలికి పోలీసులు మేకులు గుచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నొప్పి భరించలేక అతను తల్లడిల్లిపోతున్న వీడియో నెటిజెన్లకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.
మరోవైపు, ఈ ఘటనపై బాధితుడి తల్లి శైలజా దేవి ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. అయితే, ఈ ఘటనపై పోలీసులు తమదైన శైలిలో మరో వాదన వినిపిస్తున్నారు. ఓ విగ్రహాన్ని ధ్వంసం చేసిన కేసు నుంచి తప్పించుకోవడానికి రంజిత్ తనకు తానే మేకులు గుచ్చుకున్నాడని పోలీసులు చెపుతున్నారు. మాస్క్ ధరించనందుకు అతనిపై కేసు నమోదు చేశామని తెలిపారు.