Gangrene: కొవిడ్ రోగుల్లో కొత్త ముప్పు... పలు కేసుల్లో గ్యాంగ్రీన్ లక్షణాలు

Experts identifies gangrene in covid patients
  • కొవిడ్ రోగుల్లో రక్తం గడ్డలు కడుతున్న వైనం
  • అయితే అది గ్యాంగ్రీన్ కు దారితీస్తుందంటున్న వైద్యులు
  • రక్తం అందక అవయవాలు నశిస్తాయని వెల్లడి
  • వైద్యం అందకపోతే ప్రాణాపాయం తప్పదని స్పష్టీకరణ
కరోనా వైరస్ కలిగించే లక్షణాలే కాక, ఇతర ఆరోగ్య సమస్యలు కూడా రోగుల పాలిట ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఇప్పటికే బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ కొవిడ్ బాధితుల్లో మృత్యుఘంటికలు మోగిస్తున్నాయి. ఇవే కాక, ఇటీవల కరోనా రోగుల్లో మరో కొత్త ముప్పు ఏర్పడుతున్నట్టు వైద్య నిపుణులు వెల్లడించారు. చాలా కేసుల్లో గ్యాంగ్రీన్ ను గుర్తించామని తెలిపారు.

ఓ శరీర భాగానికి రక్తం సరఫరా చేసే నాళాలు మూసుకుపోయినప్పుడు, ఆ భాగానికి ప్రాణవాయువు, ఇతర పోషకాలు అందక అక్కడి కణజాలం నశిస్తుంది. ఆ మృత కణజాలం కారణంగా ఆ భాగమంతా నీలం రంగు లేదా నలుపు రంగులోకి మారుతుంది. దీన్ని వైద్య పరిభాషలో గ్యాంగ్రీన్ అని పిలుస్తారు.

కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా అనేకమంది రోగులు హార్ట్ అటాక్ తో మరణిస్తున్నారు. అందుకు కారణం కరోనా వైరస్ కారణంగా రక్తం గడ్డలు కట్టడమే. అయితే, ఈ విధంగా రక్తం గడ్డలు కట్టడం వల్ల గ్యాంగ్రీన్ కూడా సంభవిస్తుందని వైద్యులు అంటున్నారు.

రక్త ప్రసరణ నిలిచిపోయి ఆయా భాగాలు కృశించిపోతాయని, సకాలంలో గుర్తించకపోతే ఈ పరిస్థితి మరణాలకు దారితీస్తుందని పేర్కొన్నారు. ఇటీవల గుజరాత్ కు చెందిన హీర్జీ లుహార్ అనే వ్యక్తి కరోనా బారినపడగా, ఆపై గ్యాంగ్రీన్ ఏర్పడిందని, దాంతో కాలు తీసేయాల్సిన పరిస్థితి వచ్చిందని అహ్మదాబాద్ కు చెందిన వాస్క్యులార్ సర్జన్ డాక్టర్ మనీష్ రావల్ వెల్లడించారు.

తొలుత అతని కాలులో తీవ్రమైన నొప్పి కలిగి, ఆపై మొద్దుబారిపోయిందని వివరించారు. అప్పటికే ఆలస్యం అయిందని, మూడ్రోజుల తర్వాత అతని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకురాగా, వైద్య పరీక్షలు చేస్తే కాలులో గ్యాంగ్రీన్ ఏర్పడినట్టు గుర్తించామని, అతడి ప్రాణాలు కాపాడేందుకు కాలు తీసేయాల్సి వచ్చిందని డాక్టర్ మనీష్ రావల్ విచారం వ్యక్తం చేశారు.
Gangrene
Covid Patients
Blood Clots
Medical Experts

More Telugu News