Atchannaidu: ప్రజల ప్రాణాలతో చెలగాటం వద్దు.. ఇరు రాష్ట్రాల సీఎంలు మానవతా దృక్పథంతో ఆలోచించాలి: అచ్చెన్నాయుడు
- సమస్య ఇలాగే కొనసాగుతూ ఉంటే తెలుగు దేశం పార్టీ చూస్తూ ఊరుకోదు
- తెలంగాణలో ప్రత్యేక చట్టాలు ఏమైనా అమలవుతున్నాయా?
- భారతదేశంలో అంతర్భాగం కాదా?
- సామాన్య ప్రజల గురించి జగన్ పట్టించుకోరా?
ఆంధ్రప్రదేశ్-తెలంగాణ సరిహద్దుల వద్ద ప్రయాణికులను పదే పదే అడ్డుకుంటోన్న ఘటనలపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని, ఇరు రాష్ట్రాల సీఎంలు మానవతా దృక్పథంతో ఆలోచించాలని అచ్చెన్నాయుడు కోరారు. ఈ సమస్య ఇలాగే కొనసాగుతూ ఉంటే తమ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.
తెలంగాణలో ప్రత్యేక చట్టాలు ఏమైనా అమలు అవుతున్నాయా? భారతదేశంలో అంతర్భాగం కాదా? అని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిహద్దుల్లో ఇంత జరుగుతున్నా ఏపీ సీఎం జగన్ ఎందుకు స్పందిచడం లేదని ఆయన నిలదీశారు. సామాన్య ప్రజల గురించి జగన్ పట్టించుకోరా? అని ప్రశ్నించారు.
వైసీపీ మంత్రినో, ఎమ్మెల్యేనో ఆపితే జగన్ ఇలాగే చూస్తూ ఊరుకుంటారా? అని అచ్చెన్నాయుడు నిలదీశారు. ఏపీలో అసలు ప్రభుత్వం ఉందో లేదోనన్న అనుమానం కలుగుతోందని విమర్శించారు. సరిహద్దుల వద్ద పదేపదే ఈ గొడవలేంటని మండిపడ్డారు.