Neelam Sahni: ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్!
- పరిషత్ ఎన్నికలను రద్దు చేసిన హైకోర్టు
- ఎసీఈసీ తీరును తప్పుపట్టిన న్యాయస్థానం
- నీలం సాహ్నిపై పిటిషన్ వేసిన రేగు రమేశ్
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు కీలక తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. తీర్పు సమయంలో ఎస్ఈసీ నీలం సాహ్నిపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలను అర్థం చేసుకోవడంలో కూడా విఫలమయ్యారని విమర్శించింది. ఎస్ఈసీగా ఆమె అర్హతను కూడా అనుమానించాల్సిన పరిస్థితి ఉందని వ్యాఖ్యానించింది.
మరోవైపు ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈమె నియామకం సరైనది కాదని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ ను రేగు రమేశ్ అనే వ్యక్తి దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు... ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. వేసవి సెలవుల తర్వాత ఈ పిటిషన్ పై విచారణ కొనసాగుతుందని తెలిపింది.
జగన్ ప్రభుత్వంలో నీలం సాహ్ని తొలుత సీఎస్ గా పని చేశారు. ఆ తర్వాత ఆమె పదవీ విరమణ చేశారు. అనంతరం జగన్ ఆమెను ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. ఆ తర్వాత ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్ పదవీకాలం ముగిసింది. దీంతో, ఆమెను నిమ్మగడ్డ స్థానంలో ఎస్ఈసీగా నియమించారు.
ఎస్ఈసీగా ఆమె పదవీ బాధ్యతలను చేపట్టిన వారం రోజుల వ్యవధిలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అనంతరం పది రోజుల వ్యవధిలోనే పోలింగ్ జరిగింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం నోటిఫికేషన్ కు, పోలింగ్ కు మధ్య నాలుగు వారాల వ్యవధి ఉండాలని, సుప్రీం ఆదేశాలను తుంగలో తొక్కారంటూ ఎస్ఈసీపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికలను రద్దు చేసింది.