Kotaiah: ఆనందయ్య కరోనా మందు తీసుకున్న కోటయ్య పరిస్థితి మళ్లీ క్షీణించిన వైనం
- ఆనందయ్య మందు తీసుకున్న హెడ్ మాస్టర్ కోటయ్య
- నిన్న ఆక్సిజన్ లెవల్స్ పెరిగాయంటూ ప్రచారం
- ఇవాళ ఆక్సిజన్ లెవల్స్ పడిపోయిన వైనం
- కోటయ్యను ఆసుపత్రిలో చేర్చిన కుటుంబసభ్యులు
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఇచ్చే కరోనా మందు తీసుకున్న హెడ్ మాస్టర్ కోటయ్య ఆరోగ్యం మరోసారి క్షీణించింది. ఆనందయ్య మందుతో కోటయ్య ఆక్సిజన్ లెవల్స్ పెరిగాయని నిన్నటివరకు ప్రచారం జరిగింది. అయితే, ఇవాళ కోటయ్య ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో కుటుంబసభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆనందయ్య మందుపై సందేహాలు అలముకున్నాయి.
కాగా, ఆనందయ్య పంపిణీ చేస్తున్న కరోనా ఔషధంపై ఆయుష్ శాఖ నిపుణుల అధ్యయనం కొనసాగుతోంది. ఆయుష్ కమిషనర్ రాములు కృష్ణపట్నంలో పర్యటించి మందు తయారీలో వాడుతున్న పదార్థాలను పరిశీలించారు. ఆనందయ్య వినియోగిస్తున్న పదార్థాలు శాస్త్రీయంగానే ఉన్నాయని రాములు అభిప్రాయపడ్డారు. ల్యాబ్ నుంచి కూడా పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందని తెలిపారు.
అటు, పోలీసులు ఆనందయ్య కరోనా ఔషధం పంపిణీ చేస్తున్న కేంద్రాన్ని ఖాళీ చేయించారు. పంపిణీ సామగ్రిని తమ అధీనంలోకి తీసుకున్నారు. మందు పంపిణీ నిలిపివేయాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే.