Nara Lokesh: డాక్టర్ సుధాకర్ ది ప్రభుత్వ హత్య : నారా లోకేశ్
- మాస్క్ అడగడమే ఆయన చేసిన నేరం
- జగన్ ఆదేశాలతో నానా హింసలు పెట్టి పిచ్చాసుపత్రిలో చేర్చారు
- నిరంకుశ సర్కర్ పై పోరాడిన ఆయనకు నివాళి అర్పిస్తున్నాము
డాక్టర్ సుధాకర్ గారి మృతి తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని టీడీపీ నేత నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. మాస్క్ అడగడమే దళిత వైద్యుడు చేసిన నేరంగా... జగన్ ఆదేశాలతో రెక్కలు విరిచి కట్టి, కొట్టి, నానా హింసలు పెట్టి పిచ్చాసుపత్రిలో చేర్పించడంతో సుధాకర్ బాగా కుంగిపోయారని తెలిసిందని అన్నారు.
ఇక సామాన్య వైద్యుడిని వెంటాడి, వేధించి చివరకు ఇలా అంతమొందించారని లోకేశ్ విమర్శించారు. సుధాకర్ గుండెపోటుతో చనిపోలేదని... ప్రశ్నించినందుకు ఆయనను రాష్ట్ర ప్రభుత్వం హత్య చేసిందని అన్నారు. నిరంకుశ సర్కారుపై పోరాడిన సుధాకర్ గారికి నివాళి అర్పిస్తున్నానని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని ట్విట్టర్ ద్వారా తెలిపారు.
నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిలో డాక్టర్ సుధాకర్ అనెస్తెటిస్ట్ గా పని చేసిన సంగతి తెలిసిందే. కరోనా ప్రారంభ సమయంలో మాస్కులు లేవంటూ ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత ఆయన సస్పెన్షన్ కు గురయ్యారు. ఆ తర్వాత ఆయన మానసిక పరిస్థితి బాగోలేదంటూ మెంటల్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ కూడా జరిగింది. కోర్టు తీర్పును వెలువరించాల్సి ఉంది.