Andhra Pradesh: రెడ్డి, కమ్మ, క్షత్రియ కులాల కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం
- ఈ మూడు కులాల వారు ఓసీలుగా ఉన్నా పేదరికాన్ని అనుభవిస్తున్నారన్న ప్రభుత్వం
- పిల్లల చదువు కోసం భూములు అమ్మేస్తున్నారని ఆవేదన
- వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంక్షేమ అభివృద్ధి సంస్థ, ఆంధ్రప్రదేశ్ కమ్మ సంక్షేమ అభివృద్ధి సంస్థ, ఆంధ్రప్రదేశ్ క్షత్రియ సంక్షేమ అభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిన్న వేర్వేరు ఉత్తర్వులను జారీ చేసింది. ఈ మూడు కులాలు ఓసీ వర్గాలుగా ఉన్నప్పటికీ ఎక్కువమంది వ్యవసాయంపై ఆధారపడ్డారని, అది గిట్టుబాటు కాకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి పేదరికాన్ని అనుభవిస్తున్నారని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
పిల్లల చదువుల కోసం కూడా ఆయా వర్గాల్లో ఉన్నవారు ఇబ్బందులు పడుతున్నారని, వ్యవసాయ భూములను కొందరు అమ్మేస్తుంటే, మరికొందరు తనఖా పెడుతున్నారని పేర్కొంది. ఇలాంటి వారికి కార్పొరేషన్ల ద్వారా ఆర్థిక సాయం అందించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది.