Prime Minister: కరోనా బారిన పడిన పిల్లల వివరాలు సేకరించండి: ప్రధాని మోదీ
- జిల్లా కలెక్టర్లతో మహమ్మారి కట్టడిపై సమావేశం
- జన్యు మార్పుల వల్లే పిల్లలకూ కరోనా అని ఆందోళన
- వ్యాక్సిన్లను వృథా చేయకూడదని అధికారులకు ఆదేశం
కరోనా బారిన పడిన పిల్లల వివరాలను సేకరించాల్సిందిగా జిల్లాల అధికారులను ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు. ఈరోజు ఆయన 11 రాష్ట్రాల్లోని జిల్లాల కలెక్టర్లతో కరోనా కట్టడిపై సమావేశం అయ్యారు. వైరస్ లో జన్యుమార్పుల వల్ల చిన్నారులకూ కరోనా సోకుతోందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని ఆయన అన్నారు. కాబట్టి కరోనా సోకిన యువత, పిల్లల వివరాలను సేకరించాలని, వారికి కరోనా ఎలా సోకుతోందో తేల్చాలని సూచించారు.
కరోనా వ్యాక్సిన్లలో వృథాను అరికట్టాలని అధికారులకు సూచించారు. ప్రస్తుతం వ్యాక్సిన్ల కొరత ఉందని, దానిని అధిగమించేందుకు వేస్టేజీని వీలైనంత వరకు తగ్గించాలని ఆయన సూచించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యాక్సిన్ ను వృథా చేయడమంటే పెద్ద నేరమన్న ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు. కాబట్టి, పట్టణ, పల్లె ప్రాంతాల్లో అవి వృథా కాకుండా చూడాలన్నారు.