Jagga Reddy: తెలంగాణ ప్రజలతో కామెడీ చేయొద్దు: తలసానిపై జగ్గారెడ్డి ఫైర్
- కరోనా కేసులు తగ్గినట్టు తలసాని నిరూపించాలన్న జగ్గారెడ్డి
- సీఎం వద్ద పేరు కోసం భజన చేస్తున్నారని విమర్శలు
- లోకమంతా పచ్చగా ఉందనుకుంటున్నారని ఎద్దేవా
- మంత్రిగా ఉన్నప్పుడు బాధ్యతతో ఉండాలని హితవు
కరోనా పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తలసానీ... తెలంగాణ ప్రజలతో కామెడీ చేయొద్దని హెచ్చరించారు. మంత్రిగా ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా మాట్లాడాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గినట్టు తలసాని నిరూపించాలని సవాల్ విసిరారు. మంత్రి తలసాని సీఎం వద్ద పేరు కోసం భజన చేస్తున్నారని జగ్గారెడ్డి విమర్శించారు.
ఇంట్లో కూర్చున్న తలసాని లోకమంతా పచ్చగా ఉందని భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. తలసాని అంత గొప్పవాడే అయితే కిషన్ రెడ్డి ఇంటి వద్ద కూర్చుని రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన మందులను రాబట్టుకోవాలని అన్నారు.
హైకోర్టు మొట్టికాయలు వేస్తుంటే రాష్ట్ర సీఎస్ ఏంచేస్తున్నారని ప్రశ్నించారు. కరోనా కష్టకాలంలో ఫార్మా ఓ మాఫియాలా తయారైందని అందరూ మాట్లాడుకుంటున్నారని తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రులు దోపిడీ చేస్తుంటే విజిలెన్స్ విభాగం ఏంచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'రెమ్ డెసివిర్ దొరకడంలేదు, ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు' అని జగ్గారెడ్డి మండిపడ్డారు.