Cow Urine: కొవిడ్ వల్ల ఊపిరితిత్తుల్లో తలెత్తే ఇన్‌ఫెక్షన్‌ను గోమూత్రం నయం చేస్తుంది: భాజపా ఎంపీ ప్రగ్యా ఠాకూర్
- తాను రోజూ గోమూత్రం సేవిస్తానన్న ప్రగ్యా
- తనకు కరోనా ఔషధం అవసరం లేదన్న ఎంపీ
- గోమూత్ర వైద్యాన్ని కొట్టిపారేసిన ఐఎంసీ
- కరోనాను నయం చేస్తుందనడానికి ఆధారాలు లేవని స్పష్టీకరణ
భాజపాకు చెందిన వివాదాస్పద ఎంపీ ప్రగ్యా ఠాకూర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. గోమూత్రం ప్రాణాల్ని రక్షిస్తుందని ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలో కార్యకర్తలకు హితబోధ చేశారు. కొవిడ్ వల్ల ఊపిరితిత్తుల్లో తలెత్తే ఇన్‌ఫెక్షన్‌ను గోమూత్రం నయం చేస్తుందని చెప్పుకొచ్చారు. తాను రోజూ గోమూత్రం సేవిస్తానని తెలిపారు.
అందువల్ల తాను ఎలాంటి కరోనా ఔషధాలు తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. రెండేళ్ల క్రితం కూడా ఆమె ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. గోమూత్రంతో పాటు ఆవు నుంచి వచ్చే ఇతర ఉత్పత్తులను కలిపి తీసుకోవడం వల్ల తనకు క్యాన్సర్ నయమైందని చెప్పుకున్నారు.
కరోనా సమయంలో వివిధ రకాల నాటు వైద్యాలు, శాస్త్రీయత లేని విధానాలు పుట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన భారత వైద్య పరిశోధన మండలి గోమూత్రం లేదా పేడ కరోనా నుంచి రక్షిస్తుందనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని స్పష్టం చేశారు.