Ganga River: గంగానదీ తీరంలో మరోసారి బయటపడిన మృతదేహాలు
- ఇటీవలే యూపీ, బీహార్ లో గంగానదిలో మృతదేహాలు
- కొవిడ్ బాధితులవేనని గుర్తించిన వైనం
- మరోసారి తీవ్ర కలకలం
- కనౌజ్ వద్ద నదిలో తేలుతున్న 50 మృతదేహాలు
- దేవరఖ్ ఘాట్ వద్ద భారీ సంఖ్యలో సమాధులు
ఇటీవల బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో గంగానది తీరంలో కరోనా రోగుల మృతదేహాలు చెల్లాచెదురుగా పారవేసిన ఘటన సంచలనం సృష్టించింది. దీనిపై కేంద్ర మానవ హక్కుల సంఘం కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో, యూపీలో గంగానది తీరం వద్ద మరోసారి భారీ సంఖ్యలో మృతదేహాలు బయటపడడం తీవ్ర కలకలం రేపుతోంది. కన్నౌజ్ లోని మహాదేవి ఘాట్ వద్ద నదిలో 50 శవాలు తేలుతుండగా గుర్తించారు. అదే సమయంలో దేవరఖ్ ఘాట్ వద్ద కూడా పెద్ద సంఖ్యలో శవాలను పూడ్చిన ఆనవాళ్లు వెల్లడయ్యాయి.
ఇప్పటికిప్పుడు పెద్ద సంఖ్యలో సమాధులు ఉండడంతో అవి కొవిడ్ మృతులవే అయ్యుంటాయని భావిస్తున్నారు. గంగానదిలో మరోసారి మృతదేహాల కలకలం రేగడంతో విచారణకు ముగ్గురు సభ్యుల కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ మూడు రోజుల్లో నివేదిక రూపొందించనుంది.