Israel: గాజాపై దాడులు కొనసాగుతూనే ఉంటాయి: ఇజ్రాయెల్ ప్రధాని హెచ్చరిక
- దాడులకు తాము కారణం కాదని స్పష్టీకరణ
- హమాస్ చర్యలకు ప్రతిచర్యలే దాడులని వెల్లడి
- ప్రజలు చనిపోకుండా దాడులు చేస్తామని కామెంట్
- గాజాలో ఇప్పటిదాకా 149 మంది మృతి
- అందులో 41 మంది చిన్నారులే
వారం రోజులుగా జరుగుతున్న దాడులకు పాలస్తీనాలోని తీవ్రవాద సంస్థ హమాసే కారణమని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అన్నారు. తమ దేశంపైకి రాకెట్ దాడులు చేయడం వల్లే ప్రతిదాడులు చేస్తున్నామని చెప్పారు. అవసరమున్నంత వరకూ గాజాపై దాడులు చేస్తూనే ఉంటామని ఆయన తేల్చి చెప్పారు. అయితే, అమాయక ప్రజలు చనిపోకుండా వీలైనంత వరకు ప్రయత్నిస్తామన్నారు.
ప్రస్తుత దాడులకు తాము కారణం కాదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం చేస్తున్న దాడులు ఇంకా మధ్యలోనే ఉన్నాయని, అవి కొనసాగుతూనే ఉంటాయని హెచ్చరించారు. ప్రజలకు హాని తలపెట్టాలన్నదే హమాస్ కుట్ర అని, అందుకే ప్రజల వెనుక దాక్కుంటోందని నెతన్యాహు మండిపడ్డారు. ప్రజల ప్రాణాలకు హాని తలపెట్టకుండానే హమాస్ తీవ్రవాదులపై దాడులు చేస్తామన్నారు.
కాగా, దాడులు మొదలైన సోమవారం నుంచి ఇప్పటిదాకా గాజాలో 149 మంది మరణించారని, అందులో 41 మంది చిన్నారులున్నారని ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు. ఇజ్రాయెల్ లో ఇద్దరు చిన్నారులు సహా 10 మంది మరణించారు. దాడులతో రగులుతున్న ఇజ్రాయెల్, పాలస్తీనాల్లో శాంతిని పునరుద్ధరించేందుకు ఐక్యరాజ్యసమితి, అమెరికా, ఈజిప్ట్ ల దౌత్యవేత్తలు ప్రయత్నిస్తున్నా ఇంకా ఓ కొలిక్కి రాలేదు.