Jairam Ramesh: కొవిషీల్డ్ డోసుల మధ్య 12 నుంచి 16 వారాల విరామం అందుకేనా?: జైరాం రమేశ్
- కొవిషీల్డ్ టీకా డోసుల మధ్య విరామం పెంపు
- గతంలో 6 నుంచి 8 వారాల విరామం
- అధ్యయనం తర్వాతే నిర్ణయం తీసుకున్నామన్న కేంద్రం
- స్వాగతించిన అదర్ పూనావాలా
- వ్యాక్సిన్ నిల్వలు లేకనే విరామం పెంచారా? అంటూ జైరాం ట్వీట్
ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా ఫార్మా సంస్థ రూపొందించిన కొవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య 12 నుంచి 16 వారాల విరామం ఉండాలని కేంద్రం పేర్కొనడం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
"కొవిషీల్డ్ టీకా డోసుల మధ్య మొదట 4 వారాల విరామం సరిపోతుందన్నారు. ఆ తర్వాత ఆ విరామాన్ని 6 నుంచి 8 వారాలకు పెంచారు. ఇప్పుడది 12 నుంచి 16 వారాలు అంటున్నారు. కొవిషీల్డ్ వ్యాక్సిన్ నిల్వలు తగినన్ని లేనందువల్లే ఈ విరామం పెంచారా? లేక, శాస్త్రీయపరమైన సలహా మేరకు ఆ నిర్ణయం తీసుకున్నారా? ఈ విషయంలో మోదీ ప్రభుత్వం నుంచి పారదర్శకతను ఆశించవచ్చా?" అని విమర్శనాత్మక ట్వీట్ చేశారు.
నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ కొవిషీల్డ్ డోసుల అంశంలో నేడు కీలక నిర్ణయాన్ని వెలువరించింది. ఎంతో లోతైన అధ్యయనం చేపట్టిన తర్వాతే 12 నుంచి 16 వారాల విరామం ఉండాలన్న నిర్ణయాన్ని వెలువరించామని, ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)ను కూడా సంప్రదించామని డాక్టర్ వీకే పాల్ వెల్లడించారు.
కొవిషీల్డ్ ను భారత్ లో ఉత్పత్తి చేస్తున్న సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధినేత అదర్ పూనావాలా కేంద్రం నిర్ణయాన్ని స్వాగతించారు. టీకా సమర్థత, వ్యాధినిరోధకశక్తి దృష్ట్యా సవ్యరీతిలో తీసుకున్న శాస్త్రీయపరమైన నిర్ణయం అని కొనియాడారు.