Vaccine: విదేశీ వ్యాక్సిన్ల దిగుమతిపై ఒకట్రెండు రోజుల్లో అనుమతి: కేంద్రం
- దేశంలో ప్రస్తుతం వ్యాక్సిన్ల కొరత
- విదేశాల నుంచి వ్యాక్సిన్ డోసుల దిగుమతిపై కేంద్రం దృష్టి
- ఫైజర్, మోడెర్నా ఎంఈఏను సంప్రదించాయని వెల్లడి
- జాన్సన్ అండ్ జాన్సన్ కూడా సిద్ధంగా ఉందని వివరణ
దేశంలో కరోనా వ్యాక్సిన్ల కొరతను ఎదుర్కోవడానికి కేంద్రం సమాయత్తమవుతోంది. విదేశాల నుంచి టీకాల దిగుమతిపై ఎల్లుండిలోగా నిర్ణయం తీసుకోనుంది. డబ్ల్యూహెచ్ఓ, ఎఫ్ డీఐ ఆమోదించిన వ్యాక్సిన్లకు అనుమతి ఇస్తామని కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతానికి టీకాల అనుమతి కోసం ఎలాంటి దరఖాస్తులు పెండింగ్ లో లేవని వివరించింది.
ఫైజర్, మోడెర్నా సంస్థలు తమ టీకాలను అందుబాటులోకి తెచ్చేందుకు ఎంఈఏను సంప్రదించాయని పేర్కొంది. భారత్ లో వ్యాక్సిన్ ఉత్పత్తికి జాన్సన్ అండ్ జాన్సన్ సిద్ధంగా ఉందని తెలిపింది. తమ అంచనాల ప్రకారం ఆగస్టు-డిసెంబరు మధ్య భారత్ లో 216 కోట్ల వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉంటాయని కేంద్రం అభిప్రాయపడింది..
ఇక, ఇతర సంస్థలకు కొవాగ్జిన్ తయారీ అప్పగించాలన్న ప్రతిపాదనలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇతర సంస్థల్లో కొవాగ్జిన్ ఉత్పత్తిపై భారత్ బయోటెక్ తో చర్చించామని, బయటి సంస్థల్లో కొవాగ్జిన్ ఉత్పత్తిపై భారత్ బయోటెక్ సానుకూలంగా స్పందించిందని వివరించింది. అయితే నిర్దేశిత ప్రమాణాలతో కరోనా వ్యాక్సిన్లు ఉత్పత్తి చేయాలంటే బీఎస్ఎల్-3 స్థాయి ల్యాబ్ లు ఉండాలని స్పష్టం చేసింది.