Covishield: ఆక్స్ ఫర్డ్ టీకా ఒక్క డోసు వేసుకున్నా 80% తగ్గుతున్న కరోనా మరణాల ముప్పు!
- ఇంగ్లాండ్ ప్రజారోగ్య శాఖ అధ్యయనంలో వెల్లడి
- ఫైజర్ వ్యాక్సిన్ వేసుకున్నా అదే ప్రభావం
- ఫైజర్ రెండు డోసులతో 97% తక్కువ ముప్పు
ఆక్స్ ఫర్డ్ ఆస్ట్రాజెనెకా (మన దగ్గర కొవిషీల్డ్) వ్యాక్సిన్ చాలా బాగా పనిచేస్తోందని, మరణాలను తగ్గిస్తోందని ఇంగ్లండ్ ప్రజారోగ్య శాఖ (పీహెచ్ఈ) వెల్లడించింది. టీకా ఒక్క డోసు వేసుకున్నా కరోనా మరణాల ముప్పు 80 శాతం తగ్గుతోందని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఆస్ట్రాజెనికా వినియోగం, దాని వల్ల కలుగుతున్న ప్రభావాలను అంచనా వేసి ఈ నిర్ధారణకు వచ్చామని పేర్కొంది.
ఇటు ఫైజర్, బయోఎన్ టెక్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ వేసుకుంటే మరణాల ముప్పు 80 శాతం తగ్గుతోందని, రెండు డోసులూ వేసుకుంటే కనుక 97 శాతం తగ్గిస్తోందని పేర్కొంది. డిసెంబర్ నుంచి ఏప్రిల్ మధ్య నమోదైన లక్షణాలున్న కేసులు, పాజిటివ్ అని తేలిన 28 రోజులకు చనిపోయిన వారి వివరాలను అధ్యయనం చేసినట్టు పీహెచ్ఈ వెల్లడించింది.
అప్పట్లో వ్యాక్సిన్ వేసుకోని వారితో పోలిస్తే ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ఒక్క డోసు తీసుకున్న వారిలో కరోనా మరణాల ముప్పు 55 శాతం తగ్గిందని, ఫైజర్ విషయంలో అది 44 శాతంగా ఉందని పేర్కొంది. మొత్తంగా రెండు వ్యాక్సిన్లలో ఏదైనా ఒక వ్యాక్సిన్ సింగిల్ డోస్ వేసినా 80 శాతం వరకు మరణాల ముప్పును తగ్గిస్తున్నాయని పేర్కొంది.