West Bengal: ఇది రాజ్యాంగం నాకు కల్పించిన బాధ్యత: పశ్చిమ బెంగాల్ రాష్ట్ర గవర్నర్

WB Governor to visit violence affected areas
  • హింస చోటుచేసుకున్న ప్రాంతాల్లో పర్యటిస్తా
  • ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినా స్పందన రాలేదు  
  • రాష్ట్రంలోని పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి
రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత హింస చోటుచేసుకున్న ప్రాంతాల్లో తాను పర్యటిస్తానని పశ్చిమబెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధన్కర్ తెలిపారు. రాజ్యాంగం తనకు కల్పించిన బాధ్యతలను నిర్వహించడం తన విధి అని... అందులో భాగంగానే హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాల్లో పర్యటిస్తానని చెప్పారు.

తన పర్యటనకు సంబంధించి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరానని తెలిపారు. అయితే, దురదృష్టవశాత్తు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాలేదని చెప్పారు. ఏదేమైనప్పటికీ తన షెడ్యూల్ ప్రకారం తన పర్యటన కొనసాగుతుందని అన్నారు.

ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర పరిస్థితి దారుణంగా తయారయిందని గవర్నర్ తెలిపారు. రాష్ట్రంలో ప్రతీకార హింస, కాల్పుల వంటి చర్యలు, ఇప్పుడు బెదిరింపులు, దోపిడీలు పెరిగిపోయాయని మండిపడ్డారు. రాష్ట్ర పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు.
West Bengal
Governor
Jagdeep Dhankar

More Telugu News