assam: అసోం సీఎంగా హిమంత బిశ్వశర్మతో ప్రమాణం చేయించిన గవర్నర్ జగదీశ్
- అసోంకి 15వ ముఖ్యమంత్రిగా హిమంత
- ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి నడ్డా హాజరు
- త్రిపుర, మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్ సీఎంలు కూడా
ఇటీవల అసోంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మరోసారి విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో హిమంత బిశ్వశర్మను రాష్ట్ర సీఎంగా బీజేపీ అధిష్ఠానం నిన్నే ప్రకటించింది. ఈ క్రమంలో ఈ రోజు ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జగదీశ్ ముఖి ఆయనతో ప్రమాణం చేయించారు. హిమంత బిశ్వశర్మ అసోంకి 15వ ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు.
ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, త్రిపుర, మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్ సీఎంలు బిప్లవ్ దేవ్, కాన్రాడ్ సంగ్మా, బీరేన్ సింగ్, నేపియూ రియో హాజరయ్యారు.
రాజకీయ వ్యవహారాల్లో చాలా చురుకుగా వ్యవహరిస్తారని హిమంతకు మంచి పేరు ఉంది. అసోం ఎన్నికల్లో బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడంలో ఆయన కీలక పాత్ర పోషించడంతో పార్టీ అధిష్ఠానం దృష్టిని ఆకర్షించారు. ఎన్నికలకు ముందు ఏడాదిపాటు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రిగా ఆయన ఉన్నారు. ఆ సమయంలో రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం సమర్థంగా పనిచేశారని ప్రశంసలు అందుకున్నారు.