Himantha Biswa Sarma: అసోం సీఎం అభ్యర్థిగా హిమంత బిశ్వశర్మ
- ఇటీవల ఎన్నికల్లో బీజేపీ విజయం
- సీఎం పీఠం కోసం గట్టి పోటీ
- ఢిల్లీ వెళ్లిన శర్బానంద, హిమంత
- సీఎం పీఠంపై హిమంత పట్టు
- హిమంతకే ఓటేసిన బీజేపీ హైకమాండ్
- సీఎం పదవికి రాజీనామా చేసిన శర్బానంద
అసోం తదుపరి సీఎం ఎవరన్నది వెల్లడైంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ మరోమారు గెలిచిన సంగతి తెలిసిందే. హిమంత బిశ్వశర్మను అసోం సీఎం అభ్యర్థిగా బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది. ఇప్పటివరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన శర్బానంద సోనోవాల్ రాజీనామా చేశారు. అసోం తదుపరి ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వశర్మ సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇవాళ గువాహటిలో బీజేపీ శాసనసభాపక్షం సమావేశం కాగా బిశ్వశర్మ పేరును శర్బానంద సోనోవాల్ ప్రతిపాదించారు.
అసోం అసెంబ్లీలో 126 స్థానాలు ఉండగా, ఇటీవల ఎన్నికల్లో బీజేపీ 60 సీట్లు నెగ్గింది. బీజేపీ భాగస్వామ్య పక్షాలు ఏజీపీ 9, యూపీపీఎల్ 6 స్థానాలు గెలిచాయి. కాగా, అసోం కొత్త సీఎం హిమంత బిశ్వశర్మ ఆరేళ్ల కిందట కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరారు. గత ప్రభుత్వ హయాంలో ఆరోగ్య మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
కాగా, అసోం సీఎం పీఠం హిమంత బిశ్వశర్మకు దక్కడం వెనుక చాలా డ్రామా నడిచింది. శర్బానంద సోనోవాల్, బిశ్వశర్మ ఢిల్లీ వెళ్లి ఎవరి ప్రయత్నాలు వారు చేశారు. బీజేపీ జాతీయ చీఫ్ జేపీ నడ్డా, అమిత్ షాలతో వేర్వేరుగానూ, ఇద్దరూ కలిసి పలు పర్యాయాలు భేటీ అయ్యారు. సీఎం పీఠం తనకే ఇవ్వాలంటూ హిమంత పట్టుబట్టిన నేపథ్యంలో అధిష్ఠానం ఆయనవైపే మొగ్గుచూపింది.