Andhra Pradesh: పోలవరం ప్రాజెక్టుతో తెలంగాణకు ముంపు ఉండదు: తేల్చి చెప్పిన ఏపీ

No threat to Telangana with Polavaram project says AP

  • ఏపీ, తెలంగాణ అధికారులతో పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం
  • తెలంగాణ అధికారులతో కలిసి సంయుక్త సర్వే నిర్వహించామన్న ఏపీ
  • నివేదికను ఎన్‌జీటీకి సమర్పిస్తామని స్పష్టీకరణ
  • సామర్థ్యానికి అనుగుణంగానే ప్రాజెక్టును నిర్మిస్తున్నామని వివరణ

పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణకు \ ముంపు ఉండదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్ అయ్యర్ నిన్న వర్చువల్ విధానంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు, ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి, పోలవరం చీఫ్ ఇంజినీర్ సుధాకర్ బాబు హాజరయ్యారు. తెలంగాణ నుంచి ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ పాల్గొన్నారు. అలాగే, కేంద్ర జలసంఘం నుంచి చీఫ్ ఇంజినీర్, కేంద్ర అటవీ పర్యాటకశాఖ అధికారి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏపీ అధికారులు మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు వల్ల వెనుకకు వచ్చే ప్రవాహాల ప్రభావం ఎంత ఉంటుందన్న దానిపై తెలంగాణ అధికారులతో కలిసి సంయుక్తంగా సర్వే నిర్వహించామని, ఆ నివేదికను కేంద్ర జలసంఘానికి అందిస్తామని చెప్పారు. దానిని పరిశీలించి, జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్‌జీటీ) ‌కు అందించవచ్చన్నారు. పోలవరం ప్రాజెక్టు కారణంగా తెలంగాణలోని పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందంటూ ఎన్‌జీటీలో కేసు దాఖలు అయింది. దీంతో ఈ విషయమై తమకు నివేదిక ఇవ్వాల్సిందిగా పోలవరం ప్రాజెక్టు అథారిటీని ఎన్‌జీటీ కోరిన నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది.

సమావేశంలో తెలగాంగాణ ఈఎన్‌సీ మురళీధర్ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు కారణంగా తెలంగాణలో కొన్ని ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందన్నారు. దీనికి ఏపీ అధికారులు సమాధానం ఇస్తూ 50 లక్షల క్యూసెక్కుల సామర్థ్యానికి అనువుగానే ప్రాజెక్టును నిర్మిస్తున్నామని, నది చరిత్రలో ఇప్పటి వరకు అంత వరదలు వచ్చిన దాఖలాలు లేవన్నారు. కాబట్టి తెలంగాణకు ముప్పు ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఏప్రిల్ 15 నుంచి 29 వరకు ఉభయ రాష్ట్రాలు కలిసి నిర్వహించిన సంయుక్త సర్వే నివేదికను కేంద్ర జలసంఘానికి సమర్పిస్తామని పేర్కొన్నారు. పోలవరం అథారిటీ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ మాట్లాడుతూ. పోలవరం డ్యాం ఎత్తు 45.72 మీటర్ల స్థాయికి అవసరమైన పునరావాస, భూసేకరణ కార్యక్రమాలు పూర్తిచేయాలని ఆదేశించారు.

  • Loading...

More Telugu News