China: నియంత్రణ కోల్పోయి భూమిపైకి దూసుకొస్తున్న చైనా రాకెట్.. సర్వత్రా భయం, భయం!

Out of control Chinese rocket is falling back to Earth

  • సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించుకుంటున్న చైనా
  • గత వారం ‘లాంగ్‌మార్చ్ 5బి’ ద్వారా అంతరిక్షంలో కోర్ మాడ్యూల్
  • అదుపు తప్పి భూమిపైకి దూసుకొస్తున్న రాకెట్
  • శకలాలు ఎక్కడ పడతాయో తెలియక శాస్త్రవేత్తల్లో టెన్షన్

డ్రాగన్ కంట్రీ చైనా తనకంటూ ఓ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించుకుంటోంది. ఈ పనుల్లో భాగంగా గతవారం ‘లాంగ్‌మార్చ్ 5బి’ అనే రాకెట్‌ ద్వారా అంతరిక్షంలోకి కోర్ మాడ్యూల్‌ను విజయవంతంగా పంపింది. ఇప్పుడా రాకెట్ నియంత్రణ కోల్పోయి భూమిపైకి శరవేగంగా దూసుకొస్తోంది. అయితే, దాని శకలాలు సముద్రంలో కాకుండా భూమిపై పడే ప్రమాదం ఉందని అంతరిక్ష నిపుణులు హెచ్చరిస్తుండడంతో జనం భయంతో హడలిపోతున్నారు.

ఈ నెల 8న ఆ రాకెట్ భూ వాతావరణంలోకి ప్రవేశించే అవకాశం ఉందని అమెరికా రక్షణ విభాగ అధికార ప్రతినిధి మైక్ హావర్డ్ వెల్లడించారు. రాకెట్ శకలాలు భూమిపై కచ్చితంగా ఎక్కడ పడతాయనే విషయాన్ని చెప్పడం కష్టమన్నారు. భూవాతావరణంలోకి ప్రవేశించడానికి కొన్ని గంటల ముందు మాత్రమే ఆ విషయాన్ని చెప్పగలమన్నారు.

మరోవైపు, రాకెట్ శకలాలు భూమిపై పడితే పెను ప్రమాదం జరిగే అవకాశం ఉందని అంతరిక్ష నిపుణులు చెబుతున్నారు. దాని బరువు 22 టన్నులు కావడంతో ప్రమాదం స్థాయి ఎక్కువగానే ఉంటుందని అంటున్నారు. అయితే, హార్వర్డ్ విశ్వవిద్యాలయం ఖగోళ నిపుణుడు జొనాథన్ మెక్ డొవెల్ మాత్రం.. రాకెట్ శకలాలు భూమిపై పడే  అవకాశాలు చాలా స్వల్పమని, అంతర్జాతీయ సముద్ర జలాల్లో పడే అవకాశాలే ఎక్కువని స్పష్టం చేశారు.

కాగా, గతేడాది ‘లాంగ్‌మార్చ్ 5బి’ని తొలిసారి ప్రయోగించినప్పుడు దాని శకలాలు ఐవరీ కోస్ట్‌పై పడి పలు గ్రామాల్లోని ఇళ్లు ధ్వంసమయ్యాయి. దీంతో ఇప్పుడేం జరుగుతుందో తెలియక పలు దేశాల్లోని ప్రజలు భయంభయంగా గడుపుతున్నారు.

  • Loading...

More Telugu News