Hyderabad: హైదరాబాద్ 'జూ'లోని సింహాలకు వచ్చింది కరోనా కాదు.. సార్స్ కొవ్-2!
- ఎనిమిది సింహాలకు సోకిన వైరస్
- ఈ వైరస్ ను సార్స్ కొవ్-2గా వ్యవహరిస్తారన్న వైద్యులు
- మిగిలిన సింహాలను ఐసొలేషన్ లో ఉంచిన అధికారులు
హైదరాబాదులోని నెహ్రూ జూ పార్కులో ఏకంగా ఎనిమిది సింహాలకు కరోనా సోకినట్టు వచ్చిన వార్తలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. 'జూ'లో ఉన్న సింహాల్లో కరోనా లక్షణాలు కనిపించడంతో గత నెల 24న వాటి శాంపిల్స్ ను సేకరించి, పరీక్షల నిమిత్తం సీసీఎంబీకి పంపించారు. తాజాగా వాటి టెస్టు రిపోర్టులు వచ్చాయి. ఎనిమిదింటికి వైరస్ సోకినట్టు పరీక్షల్లో తేలింది. అయితే ఇది కొవిడ్ కాదని... ఈ వైరస్ ను సార్స్ కొవ్-2గా వ్యవహరిస్తారని వైద్యులు తెలిపారు.
సింహాలకు వైరస్ సోకినట్టు రిపోర్టులు వచ్చిన వెంటనే జూ అధికారులు అప్రమత్తమయ్యారు. మిగిలిన సింహాలను ఐసొలేషన్ లో ఉంచారు. కరోనా బారిన పడిన సింహాలకు చికిత్స అందిస్తున్నారు. ఈ సందర్భంగా జూ అధికారులు మాట్లాడుతూ, సింహాలు ఆరోగ్యంగానే ఉన్నాయని, ఆహారాన్ని తీసుకుంటున్నాయని తెలిపారు. మరోవైపు కరోనా నేపథ్యంలో ఇప్పటికే హైదరాబాద్ 'జూ'తో పాటు దేశ వ్యాప్తంగా పలు జంతుప్రదర్శనశాలలను మూసేశారు.