TS High Court: ఈటలకు ఊరట...  ప్రభుత్వ తీరును తప్పుబట్టిన హైకోర్టు

High Court stays on govt actions over Eatala issue

  • ఈటలపై భూ అక్రమాల ఆరోపణలు
  • మంత్రిమండలి నుంచి తొలగింపు
  • విచారణకు ఆదేశించిన సీఎం కేసీఆర్
  • ఈటల భూముల్లో సర్వే
  • హైకోర్టును ఆశ్రయించిన ఈటల కుటుంబ సభ్యులు

మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై తీవ్రస్థాయిలో భూకబ్జా ఆరోపణలు రావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఈటల భూముల వ్యవహారంపై విచారణకు ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం, యుద్ధ ప్రాతిపదికన సర్వే చేపట్టింది. ప్రభుత్వ చర్యలపై ఈటల కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్ పై నేడు విచారణ చేపట్టిన న్యాయస్థానం ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈటల భూముల్లో సర్వే చేయాలని నిర్ణయించుకున్నప్పుడు ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ప్రశ్నించింది. సర్వే సందర్భంగా సహజ న్యాయసూత్రాలు ఉల్లంఘనకు గురయ్యాయని ఆక్షేపించింది. ఈటల భూముల వ్యవహారంలో అధికారుల తీరు సరిగా లేదని, జమున హేచరీస్ భూములు, వ్యాపారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోరాదని స్పష్టం చేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

జమున హేచరీస్ పై బలవంతపు చర్యలు తీసుకునే ప్రయత్నం చేయొద్దని స్పష్టం చేసింది. ఈ నెల 1, 2వ తేదీల్లో జరిగిన విచారణను పరిగణనలోకి తీసుకోవద్దని, మెదక్ జిల్లా కలెక్టర్ ప్రాథమిక నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ క్రమంలో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు... పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి సూచించింది.

  • Loading...

More Telugu News