Chandrababu: చంద్రబాబు ఆస్తులపై విచారణ కోరుతూ లక్ష్మీపార్వతి పిటిషన్... కొట్టివేసిన న్యాయస్థానం
- చంద్రబాబు అక్రమాస్తులు కూడబెట్టారన్న లక్ష్మీపార్వతి
- 2005లో పిటిషన్
- లక్ష్మీపార్వతికి పిటిషన్ వేసే అర్హత లేదన్న కోర్టు
- ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని వెల్లడి
టీడీపీ చీఫ్ చంద్రబాబు ఆస్తులపై విచారణ జరపాలంటూ వైసీపీ నేత లక్ష్మీపార్వతి 2005లో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్ ను ఏసీబీ కోర్టు తాజాగా కొట్టివేసింది. లక్ష్మీపార్వతి ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని, లక్ష్మీపార్వతికి పిటిషన్ వేసే అర్హత లేదని స్పష్టం చేసింది. కాగా, ఈ కేసు విచారణ గత ఫిబ్రవరిలో కూడా జరిగింది. ఆ సమయంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.
లక్ష్మీపార్వతి పిటిషన్ పై విచారణ సందర్భంగా తన వాదనలు కూడా వినాలని చంద్రబాబు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే, చంద్రబాబు అభ్యర్థనను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. వాదనలు వినిపిస్తామని కోరే హక్కు చంద్రబాబుకు లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.